సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): అఘాయిత్యానికి గురైన బాధిత మహిళల్లో మనోధైర్యాన్ని నింపుతూ, మేమున్నామంటూ భరోసా కౌన్సిలర్లు అండగా నిలుస్తున్నారు. భరోసా కేంద్రంలోకి వెళ్లిన బాధితులను ప్రేమ, అప్యాయతతో పలుకరిస్తున్నారు. ఒక స్నేహితురాలిగా, కుటుంబ సభ్యులుగా, ఉపాధ్యాయులుగా, ఒక అధికారిగా.. అన్ని విషయాలను బాధితులతో పంచుకుంటున్నారు. మహిళలు, యువతులు, పిల్లలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించిన ఘటనల్లో బాధితులను వెంటనే స్థానిక పోలీసులు భరోసా కేంద్రానికి పంపిస్తున్నారు. భరోసా కేంద్రంలో బాధితులకు మేమున్నామనే విశ్వాసాన్ని కల్పిస్తున్నారు. ఆపదలో ఉన్న బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, గాయపడ్డ మనసుకు చికిత్స చేస్తున్నారు. బంగారు భవిష్యత్ ఉన్నదని భరోసా కల్పిస్తున్నారు.
జుబ్లీహిల్స్ ఘటనలో..
జుబ్లీహిల్స్ ఘటనలో మైనర్ బాధితురాలు షాక్కు గురయ్యింది. ఆ ఘటన నుంచి ఆమె కోలుకోలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. జుబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. భరోసా కేంద్రంలో మహిళా అధికారులున్నారు. మాకు చెప్పలేని విషయాలు అక్కడ చెప్పమని బాధితురాలితోపాటు ఆమె కుటుంబ సభ్యులకు సూచించారు. భరోసా కేంద్రానికి వెళ్లిన తరువాత ఆమెతో అక్కడి సిబ్బంది ఒక స్నేహితురాలిగా, తల్లిగా అన్ని విషయాలు మాట్లాడారు. మేమున్నామనే ధైర్యాన్ని ఇచ్చారు. ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఆమె ఆ షాక్ నుంచి కొద్దిగా కోలుకొని జరిగిన ఘటనపై నోరు విప్పింది. ఆమె చెప్పిన విషయాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
మతి స్థితిమితం లేని మైనర్పై..
గత ఏడాది మొగల్పురా పోలీస్స్టేషన్ పరిధిలో ఒక బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలికి మతిస్థిమితం సరిగా లేదనే విషయాన్ని గుర్తించిన నిందితులు దారుణానికి ఒడిగట్టారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని, బాధితురాలిని భరోసా కేంద్రానికి పంపించారు. భరోసా కేంద్రంలో బాధితురాలికి కౌన్సిలింగ్ నిర్వహించి, జరిగిన ఘోరంపై ఆరా తీశారు. నిందితుల ఆచూకీ చెప్పడంతో స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలిసిన వారే ఎక్కువ..
లైంగిక దాడి ఘటనల్లో పట్టుబడుతున్న నిందితుల్లో 80 శాతం బాధితులకు తెలిసిన వారే ఉంటున్నారు. నమ్మించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. జుబ్లీహిల్స్ ఘటనలో కూడా అదే జరిగింది. తెలిసిన వారని బాధితురాలు మాట్లాడితే ఆమెపై నిందితులు ఒక పథకం ప్రకారం లైంగిక దాడికి పాల్పడ్డారు. వెలుగు చూస్తున్న ఘటనల్లో నమ్మించి మోసం చేసిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి.