సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ఎవరికి దొరుకకుండా రోజుకో ప్రయోగం చేస్తున్నారు. తాజాగా సామాన్యుల చేతిలో రూ.పదివేలు పెట్టి ఖాతాను అద్దెకు తీసుకుంటున్నారు. ఖాతా దారుడికి తెలియకుండానే కోట్లాది రూపాయల లావాదేవీలు జరుపుతున్నారు. కొల్లగొట్టిన సొమ్మును ఈ ఖాతాలో జమచేసి అక్కడి నుంచి దారిమళ్లిస్తున్నారు. తాజాగా ఓ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో రాచకొండ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేయగా అద్దె ఖాతాల విషయం వెలుగులోకి వచ్చింది. అద్దె మాట్లాడటం.. ఇవ్వడం.. తీసుకోవడం.. ఇలా అంతా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. అయితే అతడికి సహకరించిన సామాన్యుడి ఖాతా మాత్రం ఖాళీగానే కనిపించింది. జరిగిన లావాదేవీలను పరిశీలిస్తే ఈ సంవత్సరంలోని 5 నెలలో సైబర్ నేరగాళ్లు రూ.2.50 కోట్లు డిపాజిట్ చేసి వాటిని తిరిగి క్రిప్టో కరెన్సీతో పాటు ఇతర మార్గాల్లో బదిలీ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు కంగుతిన్నాడు.
ఆరా తీస్తే ఖాళీ ఖాతా దొరికింది..!
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీ లాభాలు ఇస్తామని నమ్మించి ఆమె నుంచి రూ.8.50 లక్షలు కొల్లగొట్టాడు. ఈ సంఘటనపై బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా బాధితురాలి ఖాతా నుంచి బదిలీ అయిన వివరాలను సేకరించారు. అయితే ఆ బ్యాంక్ ఆచూకీ తమిళనాడులోని ఓ చిన్న గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు అద్దె ఖాతా విషయం తెలిసింది.
దీంతో లభించిన ఆధారాలతో నాజర్ భాషాను అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తే తనకు ఏమి సంబంధం లేదని ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఆన్లైన్లో ఓ గుర్తు తెలియని సైబర్ నేరగాడిని సంప్రదించానని తెలిపాడు. దీంతో వివిధ ఫోన్ నంబర్లతో మాట్లాడి తనతో ఖాతాను తెరిపించారన్నాడు. దీని కోసం తనకు నెలకు రూ.10 వేలు ఇస్తామని చెప్పారని, దీంతోఖాతా తెరిచి వివరాలు వారికి పంపించగా.. ప్రతీది వారే చూసుకుంటున్నారని తెలిపాడు. అప్పటి నుంచి ఖాతా గురించి తాను పట్టించుకోవడంలేదని పేర్కొన్నాడు. నెలకు 10 వేలు మాత్రం తీసుకున్నానని చెప్పడంతో పోలీసులు విస్తూపోయారు. ఇప్పుడు రూ.2.50 కోట్లు ఎక్కడికిపోయాయని, సామాన్యుడిచే ఖాతా తెరిపించిన సైబర్ నేరగాళ్లు ఎవరనేది ఆరా తీస్తున్నారు.