హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ)/ సుల్తాన్‌బజార్: పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త అన్నారు. దేశంలోనే అత్యధికంగా మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు లభించిందని, ఆకుపచ్చని రాష్ట్రంగా మార్చాలన్న సీఎం ఆకాంక్ష హరితహారం ద్వారా సత్ఫలితాలను ఇస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవటం, భూగర్భ జలాలు ఆశించిన దానికన్నా ఎక్కువగా పైకి రావటం ఇందుకు ఉదాహరణ అని అన్నారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం కావటం, అదే రోజున తన జన్మదినం కావటంతో ఆదివారం కోలేటి దామోదర్.. గోషామహల్‌లోని పోలీస్ స్టేడియంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2015లో విప్లవాత్మకంగా ప్రారంభమైన హరితహారం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్లకు పైగా మొక్కలను నాటినట్టు తెలిపారు. ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ కూడా దీనికి తోడవటంతో వీఐపీలంతా పోటీ పడి మొక్కలు నాటుతున్నారని వెల్లడించారు. రాష్ట్ర భూభాగంలో 33 శాతం పచ్చదనంతో నిండిందని, దీంతో వాతావరణ సమతుల్యత ఏర్పడుతున్నదని వివరించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మానవాళి మనుగడకు పర్యావరణాన్ని కాపాడుకోవాలని అన్నారు. సమాజ రక్షణతో పాటు చెట్ల రక్షణనూ పోలీసులు బాధ్యతగా భావిస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో హరితహారం కింద మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలోతెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్, అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్) డీఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.