బంజారాహిల్స్, జూన్ 5: తెలుగు సినీ పరిశ్రమ వైపు ప్రపంచం చూస్తున్నదని సినీ, టీవీ రంగంలో పని చేస్తున్న వారికి మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయని రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీవీ పరిశ్రమలోని 24 విభాగాల్లో పని చేస్తున్న పేద కళాకారులు, కార్మికులకు పీవీకేవీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 101 మందికి ఉచితంగా ఇండ్ల స్థలాలను అందజేశారు. ఆదివారం ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థల పత్రాలను మంత్రి తలసాని అర్హులైన కళాకారులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, ఎంతో గొప్ప మనసుతో పేద కార్మికులను ఆదుకునేందుకు విజయ్ కుమార్ ముందుకు రావడం అభినందనీయం అన్నారు.
తెలంగాణలో సినీ పరిశ్రమ అద్భుతంగా పని చేస్తున్నదని దేశ విదేశాల్లో పరిశ్రమ పేరు ప్రఖ్యాతలు సాధించిందన్నారు. ఇదే ఒరవడిలో టీవీ పరిశ్రమ కూడా అభివృద్ధి దిశలో పయనిస్తున్నదన్నారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పేద కళాకారుల కోసం 101 మందికి ఉచితంగా ఇండ్ల స్థలాలు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, విజయ్ కుమార్, నటుడు జాకీ, హరిత, పాల్గొన్నారు.