ఖైరతాబాద్, జూన్ 5 : రాష్ట్ర ప్రభుత్వం విశ్వనగరాభివృద్ధిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్ ఆదివారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. మెథడిస్ట్ కాలనీలోని పార్కులోమొక్కలు నాటిన ఎమ్మెల్యే దానం కాలనీలో నెలకొన్న సమస్యలను కాలనీ కమిటీ అధ్యక్షులు ఎల్. మూర్తి, సభ్యుడు ప్రసాద్, శివకిరణ్లతో చర్చించారు. రేయిన్ వాటర్ సరిగా పోవడం లేదరి, క్యాచ్పిట్లు మాత్రమే శుభ్రం చేసి వదిలేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో అవసరమైన చోట సీసీ రోడ్లు నిర్మించాలని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరగా, పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అనంతరం బీఎస్ మక్తాలో కార్పొరేటర్ వనం సంగీత యాదవ్‌తో కలిసి మొక్కలు నాటారు. సుమారు వంద మంది పారిశుధ్య కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయించగా, 17 లారీల వ్యర్థాలను సేకరించారు. పల్లె, పట్టణ ప్రగతి ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె. ప్రసన్నరామ్మూర్తి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఎస్కె అహ్మద్, నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్, జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, డీఈ చైతన్య, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, వాటర్ వర్క్స్ జీఎం హరిశంకర్, మేనేజర్ మనోజ్ఞ పాల్గొన్నారు.