బంజారాహిల్స్, జూన్ 5: రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని ఎస్పీఆర్హిల్స్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా నడుస్తున్న బిర్యానీ పాయింట్‌తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు బస్తీవాసులు ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీఆర్ హిల్స్‌లో ‘శాంతాస్ 4ఏఎమ్ బిర్యానీ’ పేరుతో బిర్యానీ పాయింట్ కొనసాగుతోంది. రాత్రి రెండు గంటలనుంచి తెల్లవారుజామున 5గంటల దాకా ఈ బిర్యానీ పాయింట్ నడిపిస్తుండడంతో వందలాదిమంది అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడకు వస్తుంటారు. పీకలదాకా మద్యం సేవించిన మందుబాబులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కడా తిండి దొరక్కపోవడంతో ఇక్కడకు వచ్చి బిర్యానీ తినడంతో పాటు రోడ్లపై నిలబడి న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారు.
ఈ సెంటర్‌కు ఎదురుగా ఉండే బస్తీల్లో అరుగులమీద కూర్చుని గట్టిగా కేకలు వేస్తుండడంతో పాటు పక్కనే మూత్ర విసర్జన చేస్తుండడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ బిర్యానీ నిర్వాహకులు తెల్లవారుజామున 2గంటలనుంచి తెరుస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కొంతమంది మందుబాబులు ఇక్కడకు వచ్చి బిర్యానీలు తినడంతో పాటు కార్లలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తుండడంతో బస్తీవాసులు అక్కడకు చేరుకుని నిలదీశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పాటు కొంతమంది మందుబాబులు బస్తీవాసులమీద రాళ్లు విసిరారు. దీంతో బస్తీవాసులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.