ఖైరతాబాద్, జూన్ 5: మనుషులతో సమానంగా జంతువులకూ జీవించే హక్కు ఉంటుందని మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ అన్నారు. జంతువుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జంతువుల హక్కులు కాపాడుదామంటూ శశికిరణ్, సినీనటి సదాతో కలిసి యువతీ, యువకులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. అనంతరం శశికిరణ్ మాట్లాడుతూ మనుషుల్లాగానే జంతువులకు కూడా ప్రాణం, బాధలు ఉంటాయని, ఆహారం కోసం వాటిని తినడం మంచిది కాదన్నారు. జంతువుల మాంసం, పాలు, చర్మం, వెంట్రుకల కోసం మనిషి క్రూరంగా మారుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జంతువుల కోసం ఉన్న చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు.