సిటీబ్యూరో, జూన్ 5(నమస్తే తెలంగాణ)/కేపీహెచ్బీ కాలనీ : రాష్ట్రంలోనే తొలి మహిళా పార్కు అందుబాటులోకి వచ్చింది. కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లో రూ.1.70 కోట్లతో ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న మహిళా, చిల్డ్రన్ పార్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావులు ఈ పార్కును ఆదివారం ప్రారంభించారు. ఆరోగ్యమే పరమావధిగా జీహెచ్ఎంసీ 55 చోట్ల వైవిధ్యమైన థీమ్ పార్కులను జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్శిటీ విభాగం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే గ్రేటర్లో మూడు చోట్ల ప్రత్యేకంగా మహిళల కోసమే పార్కును తీసుకురావాలని నిర్ణయించి ఈ మేరకు పనులు చేపట్టారు. తెలంగాణ హౌజింగ్ బోర్డు (టీహెచ్బీ), జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లో ఏర్పాటైన పనులను అందుబాటులోకి తీసుకురాగా, శేరి లింగంపల్లిలోని టీఎన్జీవో కాలనీలో 18,500 చదరపు మీటర్లు విస్తీర్ణంలో, ఎల్బీనగర్లోని సచివాలయ కాలనీలో 4,120 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పనులు జరుగుతున్నాయి.
కేపీహెచ్బీ ఫేజ్-3లోని ఐఐజేఎం సర్కిల్లో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉమెన్స్ కం చిల్డ్రన్ పార్కు అభివృద్ధి చేశారు. సెక్యూరిటీ రూం, చిన్నారులకు ఆడుకునేందుకు ఆట స్థలం, మహిళలకు యోగా ఏరియా, పరిశుభ్రత వాతావరణంలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఉమెన్ ఓరియెంటెడ్లో ప్రతిదీ ఆకట్టుకునే రీతిలో ఏర్పాట్లు చేశారు. ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, హ్యాండ్లూమ్, కల్చరల్ షోలు, గార్డెనింగ్, ఎంటర్ప్రెన్యూర్ షిప్, హోం డెకర్స్, హ్యాండీక్రాప్ట్స్, ఫన్ క్లబ్, కిట్టి పార్టీ జోన్లతో పాటు గర్భిణి మహిళలకు యోగ, ఇతర హెల్త్ సెక్షన్లు ఈ పార్కులలో అందుబాటులోకి ఉండనున్నాయి. ఈ పార్కులో కేవలం మహిళలను మాత్రమే ప్రవేశం ఉండనుంది. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చొరవతో ఈ పార్కు ఏర్పాటు సాధ్యమైందని, మహిళలతో ఈ పార్కు నిర్వహణ జరగనుందని జోనల్ కమిషనర్ మమత తెలిపారు. రాష్ట్రంలో తొలి మహిళా పార్కు కూకట్పల్లిలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.