మియాపూర్/ శేరిలింగంపల్లి/ కొండాపూర్/ మాదాపూర్, జూన్ 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్‌పేట్‌లో స్థానిక కార్పొరేటర్ వి. పూజిత గౌడ్లతో పాటు మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్లతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని అన్నారు. ఖాళీ ప్రదేశాల్లో చెత్తతో పాటు వ్యర్థాల నిల్వ లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఈఈ శ్రీకాంతిని, డీఈ సురేశ్, ఏఈ ప్రతాప్, వర్క్ ఇన్స్పెక్టర్లు ప్రేమ్, ఏఎంహెచ్ఓ, డాక్టర్ కార్తీక్, జలమండలి అధికారులు డీజీఎం నాగప్రియ, మేనేజర్ మానస, టౌన్‌ప్లానర్ డిప్యూటీ సిటీ ప్లానర్ గణపతి, ఏసీపీ సంపత్, డీఈ సునీల్, ఎంటమాలజిస్ట్ రాంబాబు తదితరులు ఉన్నారు.
ప్రతి ఒకరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి..
శేరిలింగంపల్లి : పట్టణ ప్రగతి కార్యక్రమంతో కాలనీలు, బస్తీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్లోని సురభి కాలనీలో శనివారం ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, డీఈ రమేశ్, ఏఈ సునీల్, ఏఎంహెచ్ఓ డాక్టర్ నగేశ్, స్థానిక నాయకులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కాలనీ వాసులను కోరారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ యాదయ్య, ఎంటామాలజిస్ట్ ఏఈ నాగేశ్, శానిటేషన్ సూపర్వైజర్ జలంధర్, మాజీ కౌన్స్లర్ వీరేశంగౌడ్, డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్‌లతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మాదాపూర్‌లోని శిల్పాపార్క్లో …
మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్పాపార్క్లో స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్‌గౌడ్ శనివారం జీహెచ్ఎంసీ అధికారులతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ .. డ్రైనేజీలో వ్యర్థాలు చేరకుం డా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యులు గుమ్మడి శ్రీనివాస్, శిశప్రసాద్, వేణు, గుప్తా, రాజు, ప్రసాద్, త్రినాథ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రతతోనే ఆరోగ్యం ..
కొండాపూర్ : పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మం జుల రఘునాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణ ప్రగతి రెండవ రోజులో భాగంగా ఆమె డివిజన్ పరిధిలోని వేమనరెడ్డి కాలనీ, వేమనరెడ్డి వీకర్ సెక్షన్, శివాజినగర్, అపర్ణ హిల్స్ కాలనీల్లో జీహెచ్ఎంసీ, హెచ్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు జనార్దన్‌రెడ్డి, గురు చరణ్ దూబే, వెంకటేశ్, నాగరాజ్, ఎల్లమయ్య, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణ పనులలో వేగం పెంచాలి..
మియాపూర్ : వర్షాకాలం నేపథ్యంలో ముంపు సమస్యల్లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభు త్వ విప్ ఆరరెకపూడి గాంధీ తెలిపారు. నాలాల్లో సిల్టు తొలగింపు, మ్యాన్ హోళ్లను శుభ్రం చేయడం వంటి చర్యల ద్వారా ఎంతో ఉపశమనం కలుగుతుందని అన్నా రు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట చెరువు వద్ద జరుగుతున్న నాలా రిటైనింగ్ వాల్ పనులను విప్ గాంధీ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులను నాణ్యతో సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకోవాలి..
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విప్ గాంధీ సూచించారు. కాలనీలు, వీధులలో పేరుకున్న వ్యర్థాలు, ఇతర చెత్త చెదారాల తొలగింపు, మురుగు నీటి గుంతల పూడ్చివేత, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతారని, సిబ్బంది ఇందుకోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారని అన్నారు.
మియాపూర్ డివిజన్లోని రంగాపురం, సాయిరాంనగర్ కాలనీల్లో పారిశుధ్య పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీల్లో పలు నివాసాలకు వెళ్లి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వర్షాకాలం నేపథ్యంలో ముంపు సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఎస్ఆర్పీ కనకరాజు, జీహెచ్ఎంసీ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలు : విప్ గాంధీ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు -మన బడి’ పథకంతో పాఠశాల ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సురభి కాలనీలోని ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులను శనివారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడు తూ… ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టి పాఠశాలల్లో అత్యాధునిక మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు, అధికారులు సహకరిస్తే విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో చదివించే అవకాశం ప్రతి పేదవారికి ఉంటుందని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలలను తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వీరేశంగౌడ్, వార్డు సభ్యులు శ్రీకళ, ఎంపీపీఎస్ స్కూల్ చైర్మెన్ బసవరాజు, డిప్యూటీ కమిషనర్ వెంకన్న, శేరిలింగంపల్లి ఎంఈఓ వెంకటయ్య, ఈఈ శ్రీనివాస్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.