సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో అవసరమైన అత్యవసర మందులు, బ్లడ్ కోసం రోగులను ఎట్టిపరిస్థితుల్లో బయటకు పంపవద్దని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వైద్యాధికారులను ఆదేశించారు. 24గంటల పాటు దవాఖానల్లో ఈ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. శనివారం నగరంలోని సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానకు వస్తూనే నేరుగా వార్డులన్నీ కలియతిరిగారు. దవాఖానలో అందుతున్న వైద్యసేవలపై రోగులు, వారి సహాయకులతో ఆరాతీశారు. అన్నీ సక్రమంగానే అందుతున్నట్లు రోగులు, వారి సహాయకులు జవాబు ఇచ్చారు. రోగులు, వారి సహాయకులకు అందిస్తున్న ఆహారం గురించి మంత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరీక్షలు, బ్లడ్, ఆక్సిజన్ వంటి అత్యవసర సదుపాయాలు దవాఖానలో ఉన్నాయోలేవో పరిశీలించారు. ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు కావాలో రోగులను అడిగి తెలుసుకోవడమే కాకుండా అవసరమైన సేవలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐసీయూ వార్డులో పదిహేను రోజులుగా వైద్య చికిత్సలు పొందుతున్న రోగిని పలకరించారు. ఆమెకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగగా రోగి ప్లసంటా అక్రిటాతో బాధపడుతున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కె రాజ్యలక్ష్మీ వివరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రోగుల డైట్ చార్జీలు పెంచి పౌష్టికాహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. రోగులకే కాకుండా రోగి సహాయకులకు కూడా గ్రేటర్ పరిధిలోని 18 దవాఖానల్లో 5 రూపాయలకే చక్కటి భోజనం అందిస్తోందని, దీనిని రోగి సహాయకులు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని, నిధులకు వెనకాడకుండా అన్ని ఆధునిక సదుపాయాలు కల్పిస్తామని సిబ్బందికి తెలిపారు. అలాగే పారిశుద్ధ్యం నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని, ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణకు అయ్యే చార్జీలను పెంచినట్లు గుర్తుచేశారు.
బయటి నుంచి మందులు… వైద్యులపై ఆగ్రహం
దవాఖానలో చికిత్స పొందుతున్న బాలింతలు తమ చిన్నారులకు ప్రైవేట్ మందులను వాడటాన్ని గమనించి మంత్రి సీరియస్ అయ్యారు. ప్రభుత్వం అన్ని విధాలుగా వైద్య సేవలను అందిస్తుంటే పేద రోగులకు ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి తీసుకువచ్చేందుకు ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించారు. ఈ మందులను రాసిన వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పిలిచి చర్యలు తీసుకోవాల్సిందిగా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె రాజ్యలక్ష్మికి సూచించారు. ఇక మీదట ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో సహించేది లేదన్నారు. ప్రభుత్వం రోగులకు అన్ని రకాలుగా వైద్య సేవలను అందించాల నే ధ్యేయంతో రూ. 500 కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. ఇద్దరు బాలింతలకు తమ చిన్నారులకు అవసరమయ్యే మందులను బయటి నుండి తెచ్చుకో వాలని రాసినందుకు ఇద్దరు పీడియాట్రిషన్ డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టాఫ్‌నర్సును డీఎంఈకి అటాచ్ చేయాలని ఆదేశించారు. పరీక్షలు బయటకు రాసిన మరో పీజీ డాక్టర్‌ను తీవ్రంగా మందలించారు.