సైదాబాద్, జూన్ 4: వాతావరణ మార్పులకు అనుగుణంగా మెట్ట వ్యవసాయ రంగం అభివృద్ధి, ఆధునిక సాగు విధానాలు, అధిక దిగుబడులపై చేసిన అనేక పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కైలాస్చౌదరి అన్నారు. సంతోష్‌నగర్‌లోని మెట్ట వ్యవసాయ పరిశోధన కేంద్రం (క్రీడా)లో 3రోజులపాటు జరిగిన వర్క్‌షాప్ శనివారం ముగిసింది. ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా పంటలపై, కొత్త వంగడాలపై సరికొత్త పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. దేశంలో 60 శాతంపైగా రైతాంగం వర్షాధార పంటలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారని, వీరంతా మెట్ట వ్యవసాయ విధానాలపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. మెట్ట వ్యవసాయంలో పరిశోధనలు రైతులకు మంచి ఫలితాలిస్తున్నాయని, రైతులకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వచ్చే పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలకు సూచించారు.
క్రీడా డైరెక్టర్ డాక్టర్ వీ.కే.సింగ్, ప్రొగామ్ కోఆర్డినేటర్లు డాక్టర్ ఎస్.కే.బాలు, డాక్టర్ రవీంద్రాచారి మెట్ట వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను వివరించారు. అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ భాస్కర్ వర్చువల్‌లో మాట్లాడారు. అనంతరం పలు రాష్ర్టాల్లో మెట్ట వ్యవసాయాభివృద్ధికి కృషి చేసిన పలువురు సైంటిస్ట్‌లు, రైతులకు అవార్డులు అందజేసి సత్కరించారు. క్రీడాలో 37 ఏళ్లు సుదీర్ఘంగా పనిచేసి జూలైలో ఉద్యోగ విరమణ చేస్తున్న ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మహ్మద్ ఉస్మాన్‌ను ఘనంగా సన్మానించారు. పదవీ విరమణ తర్వాత కూడా తాను సేవలు అందించేందుకు సిద్ధమని మహ్మద్ ఉస్మాన్ వెల్లడించారు.