సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పనిచేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో ఈ ఏడాది వేసవిలో ఒక రోజు అత్యధిక విద్యుత్ డిమాండు 7.14 కోట్ల యూనిట్లుగా నమోదైంది. అత్యధిక డిమాండు మే నెలలో కాకుండా ఏప్రిల్ చివరి వారంలో 27వ తేదీన అత్యధిక పీక్ అవర్ డిమాండు 3435 మెగావాట్లుగా నమోదైందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత నుంచి మే నెలలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో గరిష్ట విద్యుత్ డిమాండు అంచనా మించలేదు. అకాల వర్షాలు, తుఫాను ప్రభావంతో రోజు వారి విద్యుత్ వినియోగం తక్కువగానే నమోదైంది. కాగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 2019 మే 29న 7.38కోట్ల యూనిట్లు విద్యుత్ వినియోగం జరగ్గా, పీక్ అవర్ డిమాండు 3391గా ఉందని అధికారులు తెలిపారు. మధ్యలో 2020,2021లో కరోనా ప్రభావంతో విద్యుత్ డిమాండు 6.10 కోట్ల యూనిట్లు నుంచి 6.70 కోట్ల యూనిట్లు వినియోగం జరిగింది. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం, ఐటీ కార్యాలయాలు తెరుచుకోవడం, పరిస్థితులన్నీ సాధారణంగా మారడంతో 2022లో డిమాండు పెరుగుతుందని, 8 కోట్ల యూనిట్ల వరకు ఉంటుందని అంచనా వేసి అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయినా జూన్ 4వ తేదీ నాటికి అత్యధికంగా 7.14 కోట్ల యూనిట్లుగా నమోదైంది.