సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ);మహానగరం ప్రగతిపథంలో పయనిస్తోంది. అంతకంతకూ విస్తరిస్తున్న గ్రేటర్లో మౌలిక వసతులు కల్పిస్తూనే మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రభుత్వం పక్కాప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఎస్ఆర్డీపీ కింద రూ.671.19 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లైఓవర్లు, ఆర్యూబీ, ఆర్వోబీలు, అండర్‌పాస్‌లతో రవాణా సులభతరమైంది. రహదారుల విస్తరణ, లింకు రోడ్ల నిర్మాణం చేపట్టారు. 5250 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణతోపాటు వ్యర్థాల నుంచి ప్రస్తుతం 19 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేస్తుండగా, దీని సామర్థ్యాన్ని 48 మెగావాట్లకు పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. జలమండలి ఆధ్వర్యంలో రూ.1450 కోట్లతో సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ప్రాజెక్టు పనులు చేపట్టింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఔటర్‌పై ఎల్ఈడీ లైట్ల బిగింపుతోపాటు సర్వీస్ రోడ్ల విస్తరణ జరుగుతోంది. పురపాలక, పట్టణాభివృద్ది 2021-22 వార్షిక నివేదికను శుక్రవారం మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
నగర ముఖ చిత్రం మారుతున్నది. విశ్వనగరం దిశగా పరుగులు పెడుతున్నది. లింక్ రోడ్లు, ఉద్యానవనాలు, ఫ్లైఓవర్లు, ఉత్తమంగా పారిశుధ్య నిర్వహణ.. ఇలా అన్ని అంశాల్లో విశేష ప్రగతితో మహానగరం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. పురపాలక, పట్టణాభివృద్ధ్ది 2021-22 వార్షిక నివేదికను శుక్రవారం మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఆ నివేదికలో జలమండలి, హెచ్ఎండీఏ, బల్దియా ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్ కార్యప్రణాళికలు ఆవిష్కృతమయ్యాయి.
వావ్ ఔటర్..
ఔటర్ రింగు రోడ్డుపై రూ. 100.20 కోట్ల అంచనా వ్యయంతో 158 కి.మీటర్ల పొడవునా.. ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. సర్వీసు రోడ్డు వెడల్పు చేయడంతో పాటు ఓఆర్ఆర్ బఫర్ జోన్లో 21 కి.మీ పొడవునా సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఈ కారిడార్ పైభాగంలో సోలార్ రూప్ టాప్‌లు ఏర్పాటు చేసి 9 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు.
ట్రామాకేర్ సెంటర్లు
ఓఆర్ఆర్పై జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడే వారికి వెంటనే వైద్య సేవలను అందించేందుకు కోకాపేట, పటాన్చెరువు, దుండిగల్, శామీర్‌పేట, ఘట్కేసర్, పెద్ద అంబర్పేట్, బొంగుళూరు, తుక్కుగూడ, శంషాబాద్, తెలంగాణ పోలీస్ అకాడమీల వద్ద అడ్వాన్స్ లైఫ్ సపోర్టు, అంబులెన్స్‌లతో పాటు ట్రామా కేర్ సదుపాయాన్ని ప్రారంభించారు.
మెట్రోలో రెండు లక్షలకు పైగా..
2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి రోజు మెట్రోలో 2 లక్షలకు పైగా ప్రయాణం చేశారు. మెట్రో ప్రాజెక్టులో 35 శాతం పవర్ రీజనరేషన్ చేస్తున్నారు. డిపోల వద్ద, స్టేషన్ రూప్టాప్లపై 8.35 మెగావాట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి 12 శాతం విద్యుత్ అవసరాలను తీర్చుతున్నారు. మెట్రో రైలు వల్ల నగరంలో ఏటా 1.37 లీటర్ల పెట్రోల్, డీజిల్ పొదుపు అవుతున్నది. ఏడాదికి 1.91 లక్షల టన్నుల కార్బన్ విడుదల తగ్గుతున్నది.
పచ్చదనం పెంపు
హరితహారం కార్యక్రమంలో భాగంగా 2021-22 సంవత్సరంలో 86.54 కోట్ల మొక్కలు నాటగా…37.31 కోట్లు పంపిణీ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. రూ.2.09కోట్ల వ్యయంతో 33 పిల్లర్లకు నిలువు (వర్టికల్) ఉద్యానాలుగా తీర్చిదిద్దారు. 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద రూ. 384.8కోట్లను సమకూర్చారు. 185 చెరువుల దగ్గర మొక్కలను పెంచారు. 17.75కోట్ల వ్యయంతో మూడు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేశారు.
అన్నపూర్ణ క్యాంటీన్లు
2021-22లో 1.6 కోట్ల భోజనాలకన్నా ఎక్కువ భోజనాలు అందించినట్లు చెప్పారు. 32 సీటింగ్ అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటుకు ప్రతిపాదించి ఆరింటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. మిగిలిన 26 క్యాంటీన్లు 2022-23 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తామని ప్రకటించారు.
ఈబీఆర్టీఎస్ ప్రాజెక్టు
కేపీహెచ్‌బీ నుంచి హైటెక్ సిటీ మీదుగా రాయదుర్గం, గచ్చిబౌలి, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి వరకు ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు విధానం (ఈబీఆర్టీఎస్)లో ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. డీపీఆర్ పూర్తయింది. వివిధ అంశాలపై నివేదికలను రూపొందించారు.
డౌన్ ర్యాంప్ నిర్మాణం…
పీవీ ఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌పై ఆరాంఘర్ సర్కిల్ నుంచి టోలీచౌకి, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మిగతా ప్రాంతాలు వెళ్లే వారికి వేగంగా కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ హెచ్ఎండీఏ మరో డౌన్ ర్యాంప్‌ను లక్ష్మీనగర్ వద్ద నిర్మించింది. ఇందుకోసం రూ.9.63 కోట్ల వ్యయం చేశారు.
లింకు రోడ్లు
హెచ్ఆర్డీసీఎల్ ద్వారా మిస్సింగ్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదటి దశలో 24.35 కిలోమీటర్ల 22 లింకు రోడ్లను పూర్తి చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 114.97కోట్ల ఖర్చుతో 6.69 కిలోమీటర్ల మిస్సింగ్ రోడ్లు పూర్తయ్యాయి.
మూసీ నదిపై..
సమగ్ర ట్రాఫిక్ అధ్యయనం (సీటీఎస్) ప్రకారం మూసీనది దాటే వెళ్లే ప్రయాణికుల రాకపోకలు 2031 సంవత్సరం నాటికి ప్రస్తుత 36 లక్షల ట్రిప్పుల నుంచి.. 60 లక్షల ట్రిప్పులకు పెరుగుతాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మూసీ నదిపై వంతెనల నిర్మాణానికి నిర్ణయించారు. హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు ప్రాజెక్టు బాధ్యత నిర్వహణను అప్పగించారు. ప్రభుత్వం రూ. 545 కోట్ల వ్యయంతో 14 బ్రిడ్జిల నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ.. జీవో నంబరు 37ను జారీ చేసింది. ప్రస్తుతం డిజైన్ల రూపకల్పన జరుగుతున్నది.
రహదారులు..వరద నీటి కాలువలు
పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ
జీహెచ్ఎంసీలో రోజుకు 6765 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సేకరిస్తున్నారు. 19.8 ఎండబ్ల్యూ వ్యర్థాలను ఎనర్జీప్లాంట్కు తరలిస్తున్నారు. 500 టీపీడీ సామర్థ్యంతో జీడిమెట్ల, ఫతుల్లాగూడలో సీ అండ్ డీ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురాగా, మరో రెండు చోట్ల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు. ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా 5250 స్వచ్ఛ ఆటో టిప్పర్లను వినియోగిస్తున్నారు.
అవార్డులు..
40 లక్షల జనాభా కన్నా ఎక్కువ ఉన్న శ్రేణి (కేటగిరి)లో జీహెచ్ఎంసీ బెస్ట్ సెల్ఫ్ సస్టెయినబుల్ మెగా సిటీ అవార్డును పొందగా, 3వ స్టార్సిటీగా ప్రకటించారు. పది లక్షల కన్నా ఎక్కువ ఉన్న జనాభా కేటగిరిలో 13వ ర్యాంకును (చెత్త రహిత నగరాలకు స్టార్ రేటింగ్) బల్దియా సంపాదించింది.
సమగ్రాభివృద్ధి
మెరుగైన నీటి సరఫరా..
చెరువుల పునరుజ్జీవనం
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 20 చెరువుల అభివృద్ధి, పునరుజ్జీవన, సుందీకరణ ప్రాజెక్టును చేపట్టారు. ఇందుకోసం రూ.120 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. ఇప్పటికే పీరంచెరువు, తుర్కయాంజాల్ చెరువులను సుందరీకరించారు.
రోప్‌వే
కారిడార్-1లో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి జూ పార్కుకు, 2లో ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు, 3లో రాయగిరి నుంచి యాదాద్రి టెంపుల్ టౌన్ (6.2) కి.మీ రోప్‌వే నిర్మాణానికి ప్రతిపాదించారు.
వారసత్వ సంపద
చారిత్రక కట్టడాలను పరిరక్షించే చర్యలను వేగిరం చేశారు. బాపుఘాట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చార్‌కమాన్, మౌలాలీ కమాన్‌ను పునరుద్ధరించారు. బన్సీలాల్‌పేట దిగుడు బావిని ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు.