వెంగళరావునగర్, జూన్ 3 : సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ దవాఖాన వెనుకాల ఉన్న కేంద్ర ప్రభుత్వ మందుల డిపోలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మందుల డిపోలో ఉన్న విలువైన ఔషధాలు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో జరిగిన నష్టం రూ. 10 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు, సనత్‌నగర్ అగ్నిమాపక కేంద్రం అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన వెనుకాల కేంద్ర ప్రభుత్వ ఔషధాల డిపో ఉంది. రాష్ట్రంలోని ఈఎస్ఐ దవాఖానలు, డిస్పెన్సరీలు, కేంద్ర ప్రభుత్వ దవాఖానలకు ఇక్కడి నుంచే మందులు సరఫరా అవుతుంటాయి. విలువైన మందులను ఇక్కడ నిల్వ చేస్తుంటారు.
కాగా, శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మందులు నిల్వ చేసిన గదుల నుంచి పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఫైర్ కంట్రోల్ రూంకు (10.54 గంటలకు) సమాచారం అందించారు. మరోపక్క మంటలు అదుపుచేసే ప్రయత్నం కూడా చేశారు. క్షణాల్లో సనత్‌నగర్, యూసుఫ్‌గూడ, మల్కాజిగిరి అగ్నిమాపక కేంద్రాల నుంచి మూడు ఫైరింజన్లు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్‌రావు, జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి సురేశ్ రెడ్డి, అగ్నిమాపక కేంద్రాల అధికారులు ప్రదీప్ కుమార్, శివ పర్యవేక్షణలో మంటలను ఫోమ్, నీటి సహాయంతో అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. దర్యాప్తులో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
దాదాపు రూ.10కోట్ల నష్టం
మందుల డిపోలో జరిగిన అగ్నిప్రమాదంపై సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రమాదంలో టీబీ, కుష్ఠు వ్యాధికి సంబంధించిన సుమారు రూ.7 నుంచి రూ.10కోట్ల విలువైన మందులు దగ్ధమయ్యాయని పేర్కొన్నారు.