బంజారాహిల్స్, జూన్ 3 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా స్కిట్‌ను ప్రదర్శించిన వారితోపాటు వారిని ఉసిగొల్పిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు నాయకులు ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఓ స్కిట్లో ముఖ్యమంత్రి ఫొటోతో ఉన్న మాస్కును ఓ వ్యక్తి ధరించాడు. అభ్యంతరకరమైన రీతిలో ప్రవర్తించి, ముఖ్యమంత్రిని కించపరిచాడు. వితంతు పింఛన్లకు సంబంధించి కూడా ప్రస్తావిస్తూ.. పింఛన్ల కోసం భర్తలను చంపుతున్నారు.. అని అర్థం వచ్చేలా వెకిలి మాటలు మాట్లాడారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వెంగళరావునగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యతో పాటు మహిళా విభాగం నాయకులు శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు.