చిక్కడపల్లి, జూన్ 3: గౌడ్లకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. గౌడ, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాల్‌రాజ్ గౌడ్ నేతృత్వంలో వివిధ సంఘాల నాయకులు అబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ నివాసంలో మంత్రి కేటీఆర్‌ను శుక్రవారం కలిశారు. గౌండ్ల, కల్లుగీత సంక్షేమం, అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ పలు హామీలు ఇచ్చారని బాల్‌రాజ్ గౌడ్ తెలిపారు. గౌడ్ల కోసం ఇప్పటికే ఐదెకరాల భూమి, ఐదు కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని, అదే విధంగా గౌడ్ల కోసం త్వరలోనే ఓ కొత్త పథకం అమలు చేయనున్నట్లు ఆయన వివరించారని చెప్పారు. నీర ప్రాజెక్ట్‌ను నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసి గౌడలకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎమ్వీ రమణ, కమిటీ వైస్ చైర్మన్ గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్, వివిధ గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు.