సికింద్రాబాద్, జూన్ 3: పేద, మధ్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని రసూల్‌పురా నారాయణ జోపిడి సంఘం బస్తీలో 22.94 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 296 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను హోం మంత్రి మహమూద్ అలీ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నలతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు అన్ని సౌకర్యాలు కలిగిన సొంత ఇంటిలో సంతోషంగా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఇప్పటికే పలు చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించామని, వారు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. మురికి కూపాలను తలపించే బస్తీలు నేడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంతో కొత్తదనాన్ని సంతరించుకున్నాయని వివరించారు. అర్హులైన వారందరి పట్ల పారదర్శకంగా వ్యవహరించి ఇండ్లను కేటాయిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. అనంతరం, రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరు పేదలందరికీ కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తుందని, పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ, నిరు పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నారని, బస్తీలో అర్హత కలిగిన ప్రతి నిరుపేదకు డబుల్ ఇండ్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందని అన్నారు. ఈ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేష్, కలెక్టర్ శర్మన్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు లోక్నాథం, శ్యామ్ కుమార్‌లు, ప్రభాకర్, పాండు యాదవ్, నళినీ కిరణ్, మహిళా నాయకురాలు నివేదిత, పాటు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, పిట్ల నగేష్, కుమార్ ముదిరాజ్, ధన్‌రాజ్, బాల్‌రాజ్, చంద్రకాంత్, యూసఫ్, గఫ్పార్, ఉస్మాన్‌తో పాటు హౌసింగ్ ఇఇ వెంకటదాసు రెడ్డి, ఏఈ గంగాధర్, తహసీల్దార్ బాల శంకర్ పాల్గొన్నారు.