మన్సూరాబాద్, జూన్ 3: నల్లమందు (ఓపీఎం) అక్రమంగా రవాణా చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ టీమ్ సహకారంతో మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 30,29,000 విలువైన ఓపీఎం ఒక కిలో, పప్పి స్ట్రా 5.2 కిలోలు, పప్పి స్ట్రా పౌడర్ రెండు కిలోలు, మొబైల్ ఫోన్, రూ.19 వేల నగదు, బైకు, వేయింగ్ మిషన్ తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుతో ప్రమేయమున్న మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ సీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన పరస్మాల్ అలియాస్ పరస్ సిర్వి (30) కొంతకాలంగా మీర్పేట్లోని ఆదిత్యనగర్కాలనీలో ఉంటున్నాడు.
ఎల్బీనగర్, కాచిగూడలో సిర్వి ట్రావెల్స్ పేరుతో టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నాడు. సరూర్‌నగర్, ప్రగతీనగర్, డైనమిక్ కాలనీల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి, తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో శౌర్య పండిట్ దేవా హోటల్‌ను నడుపుతున్న దీపక్‌తో ఈ మధ్య పరస్ సిర్వికి పరిచయం ఏర్పడింది. నల్లమందు (ఓపీఎం), పప్పి స్ట్రా, పప్పి స్ట్రా పౌడర్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చునని పరస్ సిర్వి, దీపక్ పథకం వేశారు. నల్లమందు అక్రమ రవాణా ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో సంపాదించి ఆర్థికంగా బలపడే అవకాశం ఉన్నదని వ్యాపారంలోకి దిగాడు. సిర్వి ట్రావెల్ బస్సులో మధ్యప్రదేశ్, నీమచ్‌కు వెళ్లి రూ. 1.30 లక్షలు చెల్లించి ఒకకిలో ఓపీఎం, రూ. 50 వేలకు పప్పి స్ట్రాను కొనుగోలు చేశాడు.
నీమచ్ నుంచి సిర్వి ట్రావెల్ బస్సులోనే ఓపీఎం, పప్పి స్ట్రాను తీసుకుని తిరిగి నగరానికి చేరుకున్నాడు. తన ఇంట్లోనే గోప్యంగా పప్పి స్ట్రా పౌడర్‌ను తయారు చేశారు. ఓపీఎంను రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షలకు, పప్పి స్ట్రా పౌడర్‌ను రూ. 3 లక్షలకు విక్రయించేందుకు సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఈ సమాచారం ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులకు తెలిసింది. మీర్పేట్ పోలీసుల సహాయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం మీర్పేట్, ఆదిత్యనగర్‌లో ఉన్న పరస్ సిర్విని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి నల్లమందు, పప్పి స్ట్రా, పప్పి స్ట్రా పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసుతో ప్రమేయమున్న దీపక్ పరారీలో ఉన్నాడు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, ఎస్ఓటీ డీసీపీ కె. మురళీధర్, ఎస్ఓటీ ఏసీపీ డి. వెంకన్న నాయక్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి. అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.