మన్సూరాబాద్, జూన్ 3: నకిలీ దస్తావేజులు సృష్టించారు. కోటి రూపాయల విలువైన స్థలాన్ని కొట్టేశారు. ఈ కేసులో ఎనిమిది మందిని ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారిలో చంపాపేట సబ్ రిజిస్ట్రార్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. చంపాపేటకు చెందిన పసుపులేటి లక్ష్మీనర్సమ్మ 1986లో రంగారెడ్డి జిల్లాలోని నాదర్గుల్ గ్రామం సర్వేనం. 71, 72, 73లో ప్లాట్ నం. 310, 311 రెండు కలిపి 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. లక్ష్మీనర్సమ్మ 1994లో మరణించింది. సుమారు 36 సంవత్సరాల నుంచి రెండు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
ఈ రెండు ప్లాట్లపై స్నేహపురి, ఎస్ఎస్ రెసిడెన్సీలో నివాసముండే గోరింట్ల నర్సింహ (56) కన్ను పడింది. మార్కెట్లో సుమారు రూ. 85 లక్షలు ధర ఉన్న ఈ స్థలాన్ని రూ. 7 లక్షలు ఖర్చు పెట్టి కొట్టేసేందుకు పథకం వేశాడు. బడంగ్‌పేట్‌కు చెందిన ఎన్. రాఘవేందర్ రెడ్డి సహాయాన్ని గోరింట్ల నర్సింహ కోరాడు. గోరింట్ల నర్సింహ దగ్గర రూ. 3 లక్షలు తీసుకుని సదరు స్థలం హద్దులను ఏర్పాటు చేయడంతో పాటు సర్టిఫైడ్ కాపీ (సీసీ కాపీ)ని సేకరించి ఇచ్చాడు. నకిలీ దస్తావేజులు, నకిలీ వ్యక్తులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు, దళారులు ఒక ముఠాగా ఏర్పడి 600 గజాల స్థలాన్ని కొట్టేశారు. మరణించిన లక్ష్మీనర్సమ్మకు స్థానంలో వారాసిగూడకు చెందిన నర్సమ్మను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రవేశపెట్టి గుండపనేని వేణుగోపాల్ రావు పేరుపై స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు.
మోసగాళ్లు అరెస్టు..
నకిలీ దస్తావేజులు సృష్టించి 600 గజాల స్థలాన్ని కబ్జా చేసిన కేసులో గోరింట్ల నర్సింహ, గుండపనేని వేణుగోపాల్, దొంతి సాయిరాజ్, నాగరాజు, ఈదుల్ల శ్రీనివాస్‌రెడ్డి, కొత్తపల్లి కృష్ణ, తేలు వీరేశ్, మహ్మద్ నసీర్ అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 1, 02,30, 000 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, రెండు కార్లు, 5 మొబైల్ ఫోన్లు, రూ. 7,250 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుతో ప్రమేయమున్న చంపాపేట రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన దయాకర్, ఎన్.రాఘవేందర్‌రెడ్డి, నర్సమ్మ పరారీలో ఉన్నారు. చంపాపేట రిజిస్ట్రార్‌కు త్వరలో నోటీసులు జారీ చేసి ఆయన పాత్రపై సమగ్ర విచారణ చేపడుతామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, ఎస్ఓటీ డీసీపీ కె. మురళీధర్, ఎస్ఓటీ ఏసీపీ డి. వెంకన్న నాయక్, ఏసీపీ ఇబ్రహీంపట్నం ఉమామహేశ్వర రావు, ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి. అంజిరెడ్డి, ఆదిభట్ల ఇన్స్పెక్టర్ పి.నరేందర్
పాల్గొన్నారు.