కుత్బుల్లాపూర్, జూన్ 3 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చాలా గొప్పవని, అలాంటి పథకాలను తమ రాష్ట్రంలో సైతం అమలు చేస్తే బాగుండేదని కర్ణాటక ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తెలంగాణ కంటే అధిక సంఖ్యలో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని, కర్ణాటక వెళ్లి చూసి రావాలని బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ ప్రభాకర్ విసిరిన సవాల్‌ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్వీకరించారు. ఈ మేరకు శుక్రవారం కర్ణాటకకు వెళ్లి అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న పథకాలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే తమకు ఎంతో ఆశాజనంగా ఉన్నాయని, అలాంటి పథకాలు ఇక్కడ లేవని అక్కడి ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చినట్లు వివరించారు. తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు ఇప్పటికైనా తగిన బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు. పగల్బాలు పలికితే కాదని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రవేశపెట్టాలని సూచించారు.