దుండిగల్, జూన్ 3 : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నారు. శుక్రవారం ఆయన దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్‌లో స్థానిక సమస్యలపై పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పోస్టాఫీస్, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అదనపు తరగతి గదుల నిర్మాణానికి లేదా నూతన భవన ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంతో పాటు కమ్యూనిటీ హాలు పైఅంతస్తు పెండింగ్ పనులను పూర్తి చేయాలని, స్థానికంగా శిథిలావస్థకు చేరిన ఓవర్ హెడ్ ట్యాంక్‌ను తొలగించి ప్రత్యామ్నాయం చూపాల్సిందిగా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అధికారులను ఆదేశించారు. దుండిగల్‌లోని అరుంధతి వైద్యశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజుయాదవ్, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు భీమ్‌రెడ్డి, సత్తిరెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి, పోలీస్ గోవింద్‌రెడ్డి, మురళి యాదవ్, ధర్మారెడ్డి, విజయరామిరెడ్డి, గోనె రామిరెడ్డి, జీవన్‌రెడ్డి, జెమ్మి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
వైకుంఠం ధామం ఏర్పాటు చేయాలి
దుండిగల్‌కు చెందిన మున్నూరు కాపు సంఘం నేతలు శుక్రవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామానికి వైకుంఠం ధామం ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఎల్లేశ్, భాస్కర్, యాదగిరి, బలరాం, యాదయ్య, విజయసాయి, వీరయ్య, శంకర్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.