చిక్కడపల్లి, జూన్ 3: బహుజనులకు రాజ్యాధికారం కోసం పోరాడాలని ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ద్రవిడ బహుజన సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కరుణానిధి 98వ జయంతి సందర్భంగా దక్షిణాది ఆత్మ గౌరవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. తెలంగాణలో భూములన్నీ గుజరాతీ, మార్వాడీ చేతుల్లోకి వెళ్తున్నాయన్నారు. ఈ మార్వాడీ గుజరాతీ పెట్టుబడి సంస్థలు నేడు గ్రామాలకు విస్తరిస్తున్నాయని వివరించారు. ద్రవిడ బహుజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జిలకర శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో దక్షిణాది మాతృభాషల మీద దాడి జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు అభిగౌడ్, ప్రొఫెసర్ బాలబోయిన సుదర్శన్, బహుజన రచయితల సమితి మచ్చ దేవేందర్, ప్రొఫెసర్ బాలబోయిన సుదర్శన్, ఎంఆర్పీఎస్ నాయకుడు లింగా స్వామి, ఓయూ విద్యార్థి నాయకులు సలీం పాషా, స్కైబాబా, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ రియాజ్, గుడిపల్లి రవి పాల్గొన్నారు.