సికింద్రాబాద్, జూన్ 3: కంటోన్మెంట్ పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు సర్కారు కంకణం కట్టుకుందని,ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే సాయన్న మడ్‌ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలో మారేడ్‌పల్లి జోన్ డిప్యూటీ డీఈఓ యాదయ్యతో కలిసి బడిబాట కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ పాఠశాలలో రూపుదిద్దుకుంటున్నాయని, ఈ విద్యా సంవత్సరం నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లిష్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో మొత్తం 24 ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మనబడి, మన బస్తీ మన బడి కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు పిట్ల నగేష్, కుమార్ ముదిరాజ్, సదానంద్‌గౌడ్, సంతోష్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు షడ్రక్తో పాటు పాల్గొన్నారు.