సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): జవాబుదారీతనం.. మరింత పారదర్శక సేవలు అందించేందుకు నగర ట్రాఫిక్ విభాగంలోకి కొత్తగా 100 బాడీ వార్న్ కెమెరాలు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇవి అత్యాధునిక ఫీచర్లతో ఉండనున్నాయి. 2015లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ట్రై కమిషనరేట్ల పరిధిలో 200 కెమెరాలు ఉపయోగంలోకి తెచ్చారు. వాటి గడువు తీరడంతో ఒక్కొక్కటిగా పనిచేయకుండా పోయాయి. ఈ నేపథ్యంలో కొత్త బాడీ వార్న్ కెమెరాలను కొనుగోలు చేసేందుకు నగర ట్రాఫిక్ పోలీస్ అధికారులు సిద్ధమవుతున్నారు. వివిధ కంపెనీలకు సంబంధించి కెమెరాల ఫీచర్లు, ధరలను పరిశీలించే పనిలో ఉన్నారు.
పక్కాగా ఫ్రెండ్లీ పోలీసింగ్
ఉమ్మడి రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలుండేవి. ఏ పనిచేసినా.. నెగెటివ్ ధోరణిలో ఆలోచించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి పనిలో పారదర్శకత ఉండాలని, ప్రజలతో మమేకమవుతూ సేవలు అందించాలని ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను పక్కాగా అమలు చేశారు. నాన్ కాంటాక్టు పద్ధతిలో చలాన్లు విధించడంపై దృష్టి పెట్టారు. జరిమానాలను ఆన్లైన్లోనే చెల్లించుకునే వెసలుబాటు కల్పించారు. విధి నిర్వహణలో ఉండే ట్రాఫిక్ అధికారులకు బాడీ వార్న్ కెమెరాలు అప్పగించారు. ప్రజలతో మాట్లాడడం, సేవల్లో పారదర్శకంగా ఉండేందుకు విధి నిర్వహణను రికార్డు చేస్తూ వచ్చారు. అయితే గడువు ముగిసిన తర్వాత కూడా ఆ కెమెరాలు ఉపయోగించడంతో పనిచేయకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులపై వచ్చే ఆరోపణలకు ఫుల్స్టాప్ పెట్టి.. మరింత పారదర్శక సేవలు అందించేందుకు కొత్త బాడీ వార్న్ కెమెరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.