సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ) :దక్షిణ మధ్య రైల్వే అన్ని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ కోసం ఈ- వెహికల్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే హైదరాబాద్ రైల్వే స్టేషన్లో తొలుత ఈ- వెహికిల్ చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. కొనసాగింపుగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్ పరిధిలోని 32 స్టేషన్లలో ఈ- వెహికల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కాంట్రాక్టు ప్రక్రియ కూడా పూర్తయిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత దశల వారీగా అన్ని రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ కోసం ఈ- వెహికిల్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. యూనిట్ వారీగా ఎలక్ట్రికల్ వాహనాలను చార్జింగ్ చేస్తామన్నారు. ప్రతి యూనిట్‌కు రూ.20 వరకు చార్జి చేస్తామన్నారు. వాహనదారులు తమకు కావాల్సిన యూనిట్ల ప్రకారం చార్జింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుందన్నారు.
ఈ -వెహికల్ చార్జింగ్ కేంద్రాలు..
హైదరాబాద్, బేగంపేట్, ఫతేనగర్, లక్డికాపూల్, నెక్లెస్‌రోడ్, సంజీవయ్య పార్కు, హైటెక్‌సిటీ, ఘట్కేసర్, వరంగల్, పర్లివైజ్యనాథ్, ఖమ్మం, డోర్నకల్, తాండూరు, జమ్మికుంట, బీదర్, మంచిర్యాల, వికారాబాద్, చిత్తాపూర్, కాజీపేట్, భద్రాచలం రోడ్, బెల్లంపల్లి, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్, సిర్పూర్ కాగజ్‌నగర్, మధిర, భువనగిరి, లాతూర్ రోడ్, బాల్కి, మహబూబాబాద్, సేరం జహీరాబాద్ స్టేషన్లు ఉన్నాయి.