
కవాడిగూడ, జనవరి 28: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం దవాఖానల్లో ప్రజలకు కార్పొరేట్ దవాఖానల స్థాయిలో మెరుగైన వైద్యం అందించేందుకు పెద్ద ఎత్తున అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం భోలక్‌పూర్ యూపీమెచ్సీ దవాఖానను ఆయన పలువురు టీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి దవాఖాన పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దవాఖాన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దవాఖానలో రోగుల పరిస్థితిని ఆయన డాక్టర్ కృష్ణమోహన్ రావును అడిగి తెలుసుకున్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రతను పాటించాలని చెప్పారు. దవాఖాన ప్రాంగణంలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను జీహెచ్ఎంసీ సిబ్బందితో తొలగింపజేశారు. అదే విధంగా ముషీరాబాద్, భోలక్‌పూర్ యూపీహెచ్‌సీలు రెండు ఒకేచోట ఉండడంతో రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా షెడ్డు నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, నాయకులు శ్రీనివాస్, శ్రావణ్‌కుమార్, ఏ. శంకర్ గౌడ్, రహీం, మోజెస్, మున్వర్ చాంద్, ప్రవీణ్, ఆర్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.