ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 1: తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఏమేం చేశారో వివరంగా ప్రగతి నివేదికలో పేర్కొన్నారని, కేంద్రంలో ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో ఏమేం చేశారో దమ్ముంటే ప్రజలకు చెప్పాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు సవాల్ విసిరారు. రాష్ర్టానికి చెందిన బీజేపీ నాయకులు ఏదేదో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిల్లో ఏ నివేదికలో చూసినా మన దేశం సంఖ్యను అట్టడుగు నుంచి వెతుక్కోవాల్సి వస్తున్నదని దుయ్యబట్టారు. ఎనిమిదేండ్ల నరేంద్ర మోడీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని ఆరోపించారు. అవినీతి, జీవన సదుపాయాలు, పౌష్టికాహారం, ఉద్యోగ కల్పన తదితర అంశాల్లో మన దేశం అట్టడుగు స్థాయిల్లో నిలుస్తున్నదని పేర్కొన్నారు. ప్రజాస్వామిక సూచికలో మొత్తం 188 దేశాలకు గాను గతేడాది 142వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 146వ స్థానానికి దిగజారిందన్నారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాకొద్ది తెలంగాణపై కుటిల ప్రేమ చూపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ కనపరుస్తూ, రాష్ర్టానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సైతం మంజూరు చేయకుండా ఇన్నేండ్లు నిర్లక్ష్యం వహించారని గుర్తు చేశారు. కేసీఆర్ జాతీయ వ్యాప్త పోరాటానికి తమ పీఠం కదులుతుందనే భయంతోనే బీజేపీ తెలంగాణపై ప్రేమ ఒలకబోస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకులు ఆ పార్టీ వైఖరిని గమనించాలని సూచించారు. లేనిపక్షంలో ప్రజల చేతిలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.