ఆమె సీనియర్ రీసెర్చ్ ఇంజినీర్. ఇటీవల ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో హాయ్ అని మెసేజ్ వచ్చింది. చూస్తే విమానం నడుపుతున్న ఫోజులో ఫొటో ఉంది. అది నిజమని నమ్మి తను కూడా రిైప్లె ఇచ్చింది. రోజులు గడిచాయి.. నంబర్లు మారాయి.. వాట్సాప్‌లో రోజూ చాటింగ్. కాలం రివ్వున తిరుగుతోంది. మన ఫ్రెండ్షిప్కు గుర్తుగా గిఫ్ట్ పంపిస్తున్నా.. అనేగానే మురిసిపోయింది. ఆ గిఫ్ట్ మాయలో పడి ఖాతాలో దాచుకున్న రూ. 15.70 లక్షలను గుర్తు తెలియని వారికి చెల్లించుకుంది.
– సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ)
శేరిలింగంపల్లికి చెందిన యువతి(26) బీఈ కంప్యూటర్ సైన్స్ చదివింది. సీనియర్ రీసెర్చ్ ఇంజినీర్‌గా పని చేస్తుంది. ఇటీవల ఆమెకు ఇన్‌స్టాగ్రాంలో మార్క్ పేరుతో ఓ ఫ్రెండ్ రిక్వెస్టు వచ్చింది. యువతి స్పందించడంతో తాను బ్రిటీష్ ఎయిర్వేస్లో పైలట్‌గా పని చేస్తున్నట్లు కొన్ని ఫొటోలు పెట్టాడు. యూకేలో ఉంటున్న ఇంటి చిరునామాను కూడా పెట్టాడు. ఇదంతా నిజమని ఇద్దరూ వాట్సాప్ నెంబర్లు పంచుకుని చాటింగ్ చేశారు. ఇటీవల తాను యూకే నుంచి స్కాట్లాండ్కు బదిలీపై వెళ్తున్నానని, మన ఫ్రెండ్ షిప్‌కు గుర్తుగా గిఫ్ట్ పంపిస్తున్నానని చెప్పాడు. అంతే యువతి ఆ గిఫ్ట్ కోసం ఎదురు చూసింది. గిఫ్ట్ వచ్చిందని ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నామని దాదాపు 12 మంది ఫోన్ చేశారు. అయినా ఏలాంటి అనుమానం వ్యక్తం చేయని యువతి వారు చెప్పినట్లుగా, భయపెట్టినట్లుగా మొత్తం రూ. 15.70 లక్షల వారి ఖాతాల్లో వేసింది. చివరకు మోసపోయానని గుర్తించిన యువతి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
24 గంటల్లోనే ఫిర్యాదు చేయాలి..
సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు అనుమానించిన 24 గంటల్లో 1930కు ఫిర్యాదు చేస్తే కొంత నగదును బదిలీని ఆపడంతో పాటు వాటిని ఫ్రీజ్ చేయవచ్చు. ఆపై రికవరీకి కూడా అవకాశం ఉంటుంది. ఈ విషయంపై సైబర్ పోలీసులు ఎన్నో మార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయినప్పటికీ ఎంతో మంది మోసపోతూనే ఉన్నారు. మోసపోయి రోజులు గడిచిన తర్వాత ఫిర్యాదు చేస్తే రికవరీ కష్టమని, దాదాపు అసాధ్యమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్టు
జవహర్‌నగర్, మే 30 : ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడిని జవహర్‌నగర్ పోలీసులు, మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. జవహర్‌నగర్ ఇన్స్పెక్టర్ కె. చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… దమ్మాయిగూడ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో అనపురెడ్డి సుబ్బారావు ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఆ ఇంటిపై పోలీసులు దాడిచేసి సుబ్బారావును అరెస్ట్ చేయగా నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ దాడిలో రూ. 1.35లక్షల నగదు, మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు, జవహర్‌నగర్ పోలీసులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సుధీర్‌బాబు, రక్షితమూర్తి, మురళీధర్, జవహర్‌నగర్ పోలీసులు పాల్గొన్నారు.