సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ) : పాలసీదారుడి నుంచి వసూలు చేసిన సేవా పన్నును తిరిగి చెల్లించాలని బీఎం ఆఫ్ మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 ఆదేశించింది. రూ.2500 నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంది. ఎర్రగడ్డ పాంతానికి చెందిన దండు కృష్ణమూర్తిరాజు బీఎం ఆఫ్ మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మూడు జీవిత బీమా పాలసీలు తీసుకున్నారు. ఇందుకు ప్రీమియం చెల్లించే క్రమంలో ప్రతి పాలసీపై సేవా రుసుము వసూలు చేస్తున్నది. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ ఆయన హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కమిషన్-2 బెంచ్ అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యుడు జవహర్‌బాబు రూ.5498.07 మొత్తాన్ని 9 శాతం వడ్డీతో చెల్లించాలని, ఖర్చుల కింద మరో రూ.1500 చెల్లించాలని ఆదేశించారు.
వినియోగదారుడికి పరిహారమివ్వాలని ఆదేశం
ఆర్డర్ ఇచ్చిన వస్తువు సకాలంలో డెలివరీ చేయకపోవడంతోపాటు ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ సంస్థ పరిహారం చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది. గోషామహల్‌కు చెందిన సురచితరెడ్డి 2020 ఆగస్టు 9న ఫ్లిప్‌కార్ట్‌లో విప్రో కంపెనీకి చెందిన 9 వోల్ట్స్ బల్బులు ఆర్డర్ చేశా రు. వాటి ధర రూ. 1050 కాగా ఆఫర్ ధర రూ.426 నిర్ణయించారు. 2020 ఆగస్టు 15 నుం చి 17 తేదీల్లో డెలివరీ అవుతుందని, ఆ తర్వాత సరైన సమయంలో అందజేయడం కుదరలేదని మెయిల్ ద్వారా వినియోగదారుడికి సమాచారం ఇచ్చారు. మరికొన్ని రోజులకు ఏ కారణం చెప్పకుండా ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందని సమాచారం పంపారు. ఆవేదన చెందిన వినియోగదారుడు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించగా, రూ.వెయ్యి నష్టపరిహారంతోపాటు మరో వెయ్యి ఖర్చుల కింద 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.