సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): ఫ్యాషన్ అండ్ లైఫ్‌ైస్టెల్ యాక్సెసరీస్ (ఎఫ్ అండ్ ఎల్ఏ) 2018-2022 చివరి సంవత్సరం విద్యార్థుల ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిఫ్ట్) క్యాంపస్‌లో ‘డిజైన్ షోకేస్-2022’ పేరుతో నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది. ఉత్పత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని టీవర్క్స్ ఆపరేషన్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ గజ్జల శనివారం నిఫ్ట్ క్యాంపస్ ప్రాంగణంలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 16 వారాల పాటు పలు పరిశ్రమల్లో గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా 29 మంది విద్యార్థులు చేసిన ఉత్పత్తులైన హాండీక్రాఫ్ట్స్ లైఫ్‌ైస్టెల్, ఉత్పత్తి చేసిన హస్తకళలు, ఫర్నిచర్, ఆభరణాలు, హ్యాండ్‌బ్యాగులు, హోమ్ డెకర్ అండ్ ప్యాకేజింగ్ డిజైన్లను అద్భుతంగా మలిచారు. అనంతరం నిఫ్ట్ ఆడిటోరియంలో సంఘీ జ్యువెలర్స్ చైర్మన్ సంజయ్ సంఘీ హాజరై 32 మంది ఫ్యాషన్ కమ్యూనికేషన్ గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులకు అవార్డులను అందజేశారు.
దక్షిణాది విద్యార్థులు కోర్సుల్లో చేరాలి..
దక్షిణాది విద్యార్థులు ఫ్యాషన్ డిజైన్ కోర్సుల్లో చేరాలని ఫ్యాషన్ అండ్ లైఫ్‌ైస్టెల్ యాక్సెసరీస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ చిరంజీవిరెడ్డి, సంస్థ సీసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కిశోర్‌చంద్ర పేర్కొన్నారు. ఫ్యాషన్ అండ్ లైఫ్‌ైస్టెల్ యాక్సెసరీస్ విభాగం నుంచి గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం యాక్సెసరీ డిజైన్‌లో స్పెషలైజేషన్లతో నాలుగేండ్ల గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంను అందిస్తున్నదని తెలిపారు. సుమారు ఏడు కోర్సులను అందజేస్తున్నట్లు తెలిపారు. 1. ఫ్యాషన్ డిజైనింగ్, 2. టెక్స్టైల్ డిజైన్, 3.ఆక్సెసరీ డిజైన్, 4. ఫ్యాషన్ కమ్యూనికేషన్, 5.నిట్ వీయర్ డిజైన్, 6. ఫ్యాషన్ టెక్నాలజీ, 7.ఫ్యాషన్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులను నిఫ్ట్ అందజేస్తుందని తెలిపారు. ఈ కోర్సులకు ఆలిండియా స్థాయి ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఇందులో చేతివృత్తుల వర్గాలకు రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు.