మేడ్చల్, మే28(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే టిమ్స్ దవాఖాన నిర్మాణానికి భూమి పూజ చేశామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మేడ్చల్ జిల్లా ముందున్నదని చెప్పారు. ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేస్తున్నదని తెలిపారు.
వెయ్యి కోట్ల తో టిమ్స్ దవాఖాన…
జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే టిమ్స్ దవాఖాన నిర్మాణానికి భూమి పూజ చేశామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అల్వాల్ ప్రాంతంలో 28 ఎకరాల విస్తీర్ణంలో రూ. వెయ్యి కోట్ల నిధులతో టిమ్స్ ఆసుపత్రి మంజూరు కావడం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాలో మరొక డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. ఇప్పటికే ఘట్కేసర్లో ఉన్న డయాలసిస్ కేంద్రంలో వైద్య సేవలు అందుతున్నట్లు మంత్రి వివరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అందులో భాగంగానే ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి సంబంధించి 72 గంటల్లో ప్రభుత్వం నగదును వారి ఖాతాల్లో జమ చేస్తున్నదని తెలిపారు. రానున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య లు తీసుకోవాలని సూచించారు.
పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి : జడ్పీ చైర్మన్
వచ్చే నెల 3వ తేదీ నుంచి నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవనం, అటవీశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహాయం ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
సౌకర్యాలు కల్పించాలి..
మేడ్చల్ కలెక్టరేట్, మే 28 : కౌమార దశలో ఉన్న ఆడపిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, అందుకోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. శనివారం వరల్డ్ మెన్సేషనల్ హైజెన్ డే పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, జడ్పీ సీఈఓ దేవసహాయం, జిల్లా అధికారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.