ఘట్కేసర్, మే 28 : రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ను ఇస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ 8వ వార్డు కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శనివారం చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాలను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఉమ్మడి పాలనలో ప్రజలు విద్యుత్ కోసం అనేక కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యలను అధిగమించి, రాష్ట్ర అవసరాలకు సరిపోయే విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఎలాంటి కోతలు లేని విద్యుత్ సరఫరా అన్ని రంగాలకు కొనసాగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రూ.5కోట్ల 10 లక్షలతో ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌తో పరిసర గ్రామాలకు నిరంతర విద్యుత్ అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కమిషనర్ వసంత, పోచారం చైర్మన్ కొండల్‌రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ రాముడు, డీఈఈ భాస్కర్ రెడ్డి,కౌన్సిలర్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపాలిటీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాధాక్రిష్ణ, రైతు సొసైటీ డైరెక్టర్లు, విద్యుత్ అధికారులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.