ఘట్కేసర్,మే 28 : పోచారం మున్సిపాలిటీ నారపల్లిలోని వివిధ కంపెనీల్లో పొల్యూషన్ బోర్డు అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. పొల్యూషన్ బోర్డు అసిస్టెంట్ ఇంజినీర్ పద్మ సిబ్బందితో వచ్చి తనిఖీ చేశారు. నారపల్లిలో వరంగల్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఆనంద్ ఉడ్, రేవతి రైస్‌మిల్, రేవతి పారాబాయిల్డ్, ఆయిల్ మిల్లులు ఉన్నాయి. వీటి నుంచి దుర్వాసనతో పాటు, పొగ, బూడిద నిప్పులు రావడంతో కొన్ని రోజులుగా స్థానిక కాలనీవాసులు సమస్య లు ఎదుర్కొంటున్నారు. రహదారి పై నుంచి వెళ్లే ద్విచక్ర వాహన దారులు రైస్‌మిల్ పొగ నుంచి వచ్చే ఊక, బుడిదతో కూడిన నిప్పు రవ్వలు కండ్లలో పడి ప్రమాదాలకు గురవు తున్నారు. ఆయిల్ మిల్లు నుంచి తీవ్ర దుర్వాసన వస్తున్నదని, స్థానిక సాయినగర్, శివాజీ నగర్, విజయపురి కాలనీ, సదాశివ నగర్, నారపల్లి తదితర కాలనీ ప్రతినిధులు మెట్టు కొండల్‌రెడ్డి, కె.యాదగిరి, ప్రవీణ్‌కుమార్, కాశీం, ఆర్.వెంకటేశం తదితరులు పలుమార్లు పొల్యూషన్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించి స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.