మేడ్చల్ రూరల్, మే 27 : వచ్చే నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగనున్న పల్లె ప్రగతిని జయపద్రం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎంపీపీ వీర్లపల్లి రజితారాజమల్లా రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పల్లె ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతి, హారితహారం కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలన్నారు. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన మునీరాబాద్, పూడూరు, డబిల్పూర్, బండమాదారం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. హరితహారంలో గత ఏడాది నాటిన మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శైలజారెడ్డి, ఎంపీడీవో రమాదేవి, తాసీల్దార్ గీత, ఎంటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో…
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పట్టణ ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దేశించుకున్న ప్రకారం ఆయా వార్డుల్లో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో పని చేసి, జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ లావణ్య, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఘట్కేసర్ మండలంలో…
ఘట్కేసర్, మే 27 : పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సిద్ధం కావాలని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన పల్లె ప్రగతిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అరుణ, ఎంపీవో నందకిశోర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కీసర మండలంలో…
కీసర, మే 27 : గ్రామాల్లో జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులందరిపై ఉందని కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పల్లె ప్రగతి పై మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాల్లో ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పర్యటిస్తారని, ఎలాంటి సమస్యలున్న అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పల్లె ప్రగతి గ్రామసభకు పంచాయతీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు రానున్నారని తెలిపారు. స్థానికంగా సమస్యలుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తిస్తారని పేర్కొన్నారు. హరితహారం, శానిటేషన్, మురుగు కాలువలు, విద్యుత్, వివిధ రకాల అభివృద్ధి పనుల గురించి చర్చిస్తారని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో మంగతాయారు, సర్పంచులు మహేందర్రెడ్డి, పెంటయ్య, మాధురి వెంకటేశ్, కవితాజైహింద్రెడ్డి, విమలానాగరాజు, ఆండాలుమల్లేశ్, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.