హిమాయత్ నగర్, మే 27: అనాథ విద్యార్థి గృహంలో ప్రవేశం పొందేందుకు అనాథ, నిరుపేద విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్, ఉపాధ్యక్షుడు జి.గణేశ్, సంయుక్త కార్యదర్శి జి.శ్రీనివాస్ తెలిపారు. హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు ఈ గృహంలో వసతి పొందేందుకు జూన్ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అంతే కాకుండా జూని యర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో, ఇంకా ఇతర విద్యా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సైతం హాస్టల్లో వసతి కల్పిస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నీట్, ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, టీటీసీ, ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించేందుకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు వారు వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు విద్యార్హత, అనాథ సర్టిఫికెట్, ఆర్థిక నేపథ్యం వంటి పూర్తి వివరాలతో రంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్ పక్కనున్న అనాథ విద్యార్థి గృహంలో అందజేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఫోన్ నంబర్లు 040 – 2403 8676, 90300 26928లలో సంప్రదించాలని వారు కోరారు.