మన్సూరాబాద్, మే 27: దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న మహా ప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేయించేలా చర్యలు చేపడుతున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి ఫతుల్లాగూడలో రూ.21 కోట్లతో నిర్మిస్తున్న మహా ప్రస్థానం పనులను శుక్రవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆరు ఎకరాల స్థలంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరుల కోసం నిర్మిస్తున్న మహా ప్రస్థానాన్ని త్వరలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించనున్నారని తెలిపారు. బ్రాహ్మణులు అపరకర్మలు నిర్వహించుకునేందుకు వీలుగా స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మహా ప్రస్థానాన్ని విశాలమైన స్థలంలో నిర్మించడమే కాకుండా అంత్యక్రియలకు వచ్చే వారు స్నానాలు చేసుకునేందుకు గాను గదులతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. స్మశాన వాటికలో అందమైన మొక్కలను ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మహా ప్రస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గదుల్లో కూర్చుని అంత్యక్రియలను తిలకించేలా లైవ్ స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. శ్మశాన వాటికలో ఫ్రీజర్లతో పాటు లాకర్స్ సదుపాయం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అంత్యక్రియలను వీక్షించేందుకు వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్చైర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరలో మహా ప్రస్థానం పనులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, నాయకులు అనంతుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాగారం, దమ్మాయిగూడలలో పర్యటన..
కీసర: నగర శివారు మున్సిపాల్టీలో రహదారులను విస్తరించేందుకు గాను తగు చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వ పట్టణ పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ నాగారం, దమ్మాయిగూడ మున్సిపాల్టీలో స్థానిక మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో ఆయన కలిసి పర్యటించారు. నాగారం మున్సిపాల్టీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా – ఘట్కేసర్ రహదారి, దమ్మాయిగూడ చౌరస్తా నుంచి దమ్మాయిగూడ మున్సిపాల్టీ వరకు గల ప్రస్తుత రహదారులను పరిశీలించారు.