ఉస్మానియా యూనివర్సిటీ, మే 27: మోడీ గారు.. మీ పార్టీలో వారసులు లేరా? అని పాపన్న సేన పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించారు. ఇటీవల మోడీ హైదరాబాద్ నగరంలో గురువారం పర్యటించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలు సరికాదని పాపన్న సేన పార్టీ (పీఎస్పీ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ అన్నారు. కుటంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రధాన శత్రువులని అభివర్ణించిన మోడీ తన పార్టీలో వారసులను ఎంతో మందిని బరిలోకి దింపిన, దింపుతున్న విషయాన్ని ఎలా మరిచిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. దొంగే.. ‘దొంగా.. దొంగ’ అని అరిచినట్లుగా మోడీ వైఖరి ఉందని విమర్శించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, మిషన్ భగీరథ పథకాల పేర్లు మార్చి వాటిని అమలు చేస్తున్న మోడీ, అది మరిచిపోయి తన పథకాలను పేరు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. మతతత్వ ఎజెండాతో ముందుకెళ్తున్న బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని అభిప్రాయపడ్డారు.