సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): భవిష్యత్‌లో డ్రోన్లు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే భారత్ డ్రోన్ మహోత్సవ్‌ను ఢిల్లీలోని రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నది. ఈ ఉత్సవానికి నగరానికి చెందిన డ్రోన్ స్టార్టప్ కంపెనీ మారుత్ డ్రోన్ ఎంపికైంది. శుక్రవారం ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని డ్రోన్ మహోత్సవ్ వేడుకలను ప్రారంభించారు. ఈ మహోత్సవ్‌లో మారుత్ డ్రోన్స్ చేపట్టిన రెండు ప్రాజెక్టులను ప్రదర్శించారు.
ఇందులో దూర ప్రాంతాలకు మందులను సరఫరా చేసే మెడిసిన్ ఫ్రమ్ స్కై, అదేవిధంగా అడవుల్లో డ్రోన్ల ద్వారా విత్తనాలను నాటేందుకు చేపట్టిన హరా బరా కార్యక్రమం వివరాలను ప్రత్యేకంగా వివరించామని స్టార్టప్ నిర్వాహకుడు ప్రేమ్ తెలిపారు. దేశ స్థాయిలో మొట్ట మొదటి సారిగా భారత్ డ్రోన్ మహోత్సవంలో అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని, పౌరవిమానయాన శాఖ మంత్రులకు తాము తెలంగాణలో మారుత్ డ్రోన్స్ చేపట్టిన డ్రోన్ ప్రాజెక్టులను వివరించడం గొప్ప అనుభూతిగా మిగిలిపోతుందని ప్రేమ్ తెలిపారు.