‘గాంధీ దవాఖానకు ఘనచరిత్ర ఉంది. సీఎం కేసీఆర్ దవాఖాన అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు. కార్పొరేట్‌కు దీటుగా క్రమంగా మెరుగైన వసతులు, పరికరాలు సమకూర్చుకుంటున్నం. ఇందులో తెలంగాణవారితోపాటు ఇతర రాష్ర్టాల వారు ఉచితంగా చికిత్స పొందుతున్నారు. సేవల గురించి వారినడిగితే బాగున్నాయని చెప్పిండ్రు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆస్పత్రి యంత్రాంగం అహర్నిశలు శ్రమించి వేలాదిమంది ప్రాణాలు నిలబెట్టింది. వైద్యులు, సిబ్బంది రోగులకు నిరంతరం అందుబాటులో ఉండాలి. కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తాం. మందులు బయటకు రాయొద్దు.మళ్లీ వస్తా.. సూచించిన మార్పులు పరిశీలిస్తా’ అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రూ.25 కోట్లతో దవాఖానలో ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ యంత్రం, క్యాథ్‌ల్యాబ్ ప్రారంభోత్సవంతో పాటు ఆధునిక కిచెన్ నిర్మాణానికి మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ):గాంధీ దవాఖానలో వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదివారం సుమారు రెండు గంటలపాటు పర్యటించారు. గతంలో ఆయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గాంధీ దవాఖానకు వచ్చి విభాగాలవారీగా సుధీర్ఘ సమీక్ష నిర్వహించడంతోపాటు వార్డుల్లోనూ పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా వసతులపై ఆరా తీసి, కావాల్సిన సదుపాయాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సూచించిన మార్పులు కనిపించాలని, మరోసారి వచ్చి పరిశీలిస్తానని అప్పుడు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు గురువారం సుమారు రెండు గంటలు గాంధీ దవాఖానలో వివిధ విభాగాలను పరిశీలించారు. ఉదయం 11గంటలకు దవాఖానకు చేరుకున్న మంత్రి.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఐపీ, ఓపీ బ్లాకుల్లోని అనేక వార్డులను సందర్శించారు. అక్కడి రోగులను పరామర్శించారు. ‘ఎక్కడి నుంచి వచ్చారు? డాక్టర్లు సరిగా చూసుకుంటున్నారా? చికిత్స మంచిగా అందుతున్నదా?’ అంటూ ఆరాతీశారు. వైద్యులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకేమైనా సదుపాయాలు కావాలా? అని అడిగారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కావాల్సిన మందులన్నీ దవాఖానలోనే ఇస్తున్నారా? బయటికి రాస్తున్నారా? అనే అంశంపై ప్రత్యేక దృష్టిసారించారు. గాంధీలో అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
మోకీలు మార్పిడి చికిత్సలు ఎందుకు పెండింగ్.?
మోకీలు మార్పిడి చికిత్సలు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని వైద్యులను ఆరా తీశారు. ‘డాక్టర్లు ఉన్నరు.. సదుపాయాలు ఉన్నయి.. రోజుకో 10 మందికి ఆపరేషన్లు చేయొచ్చు కదా? పెండింగ్ ఎందుకు?’ అని ప్రశ్నించారు. ఇంకా ఏమైనా సాయం కావాలా? అని వైద్యులను అడిగారు.
పీజీ విద్యార్థులకు సూచనలు..
వార్డుల్లో సేవలు అందిస్తున్న పీజీ వైద్యవిద్యార్థులతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. ‘మీరు నేర్చుకునేందుకు గాంధీ దవాఖాన కన్నా గొప్ప అవకాశం రాదు. ఇక్కడ నిపుణులున్నారు. అత్యాధునిక సదుపాయాలున్నాయి. రోగుల సంఖ్య కూడా ఎక్కువే. మీరు ఎంత సేవ చేస్తే అంత నేర్చుకోగలుగుతారు’ అని తెలిపారు. నేర్చుకునే దశలోనే ఉన్నారు కాబట్టి మందుల చీటీలు రాయొద్దని, ఏదైనా ఇబ్బంది అయితే భవిష్యత్తుపై దెబ్బపడుతుందని హెచ్చరించారు.
జీతం పెంచుతున్నం.. రోగులను అడుగొద్దు
‘మీకు జీతం ఎంత ఇస్తున్నరు? ప్రతి నెల వస్తున్నయా?’ అని పారిశుధ్య కార్మికులను మంత్రి మంత్రి అడుగగా.. ‘రూ.9 వేలు ఇస్తున్నరు సారు. మూడు నెలల సంది జీతాలు ఇయ్యలేదు’ అని కార్మికులు చెప్పారు. వెంటనే స్పందించిన మంత్రి ఇప్పుడున్న కాంట్రాక్టర్‌ను పక్కకుపెడుతున్నం. కొత్తోళ్లు వస్తరు. ప్రభుత్వం నిర్వహణ ఖర్చును పెంచింది. మీకు 3-4 వేలు జీతం ఎక్కువిస్తం. పేషెంట్లను అడుగుడు బంద్ చేయాలె. పని మంచిగ చేయాలె. దవాఖానను పరిశుభ్రంగా ఉంచాలె. సక్కగ చేయకపోతే మిమ్మల్ని కూడా తీసేస్తం’ అని వారికి సూచించారు. అనంతరం 100 పడకలతో నిర్మిస్తున్న ఎంసీహెచ్ భవనాన్ని పరిశీలించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడ ఒకచోట అపరిశుభ్రంగా ఉండటం చూసి ‘పట్టణ ప్రగతిలో భాగంగా మొత్తం బాగు చేయండి’ అని ఆదేశించారు. అవసరమైతే స్థలాన్ని పార్కింగ్‌కు వాడుకోవాలని సూచించారు.
అకస్మాత్తుగా.. టాయిలెట్ల తనిఖీ..
ముందుగా ఆర్థోపెడిక్ వార్డులోకి వెళ్లిన మంత్రి హరీశ్‌రావు.. అక్కడి రోగులతో మాట్లాడారు. అక్కడి నుంచి తిరిగివెళ్తూ అకస్మాత్తుగా టాయిలెట్‌ను తనిఖీ చేశారు. పరిశుభ్రత మరింత మెరుగుపడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మోకీలు మార్పిడి వార్డులోకి వెళ్లారు. సర్జరీ చేయించుకున్నవారితో మాట్లాడారు.
గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి, మోకీలు అరిగిన బాధితులను గుర్తించామని, వారందరినీ త్వరలో గాంధీకి తీసుకొచ్చి సర్జరీలు చేయిస్తామని చెప్పారు. అనంతరం ఏఎన్ వార్డును సందర్శించారు.
ఒకరోజు రాత్రి ఆకస్మికంగా వస్తా..
వార్డుల్లో ఇంకా బెడ్లు, ఇతర సదుపాయాలు ఏమైనా కావాలా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? అని హెచ్వోడీలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పనులు చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆర్వోప్లాంట్ల ఏర్పాటు ఆలస్యం అవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వార్డులో 24 గంటల పాటు కచ్చితంగా కనీసం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలని, పీజీ విద్యార్థులపై వదిలేసి వెళ్లొద్దని అధికారులకు సూచించారు. తాను ఒకరోజు రాత్రి ఆకస్మికంగా వస్తానని, అప్పుడు ఎవరెవరు ఉన్నారో చూస్తానని చెప్పారు.
ఈ నంబర్లన్నీ పనిచేస్తున్నయా?
ప్రతి వార్డు ప్రవేశ ద్వారం దగ్గర ‘ఇక్కడ సేవలు ఉచితం. ఎవరైనా డబ్బు అడిగితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి’ అని బోర్డు పెట్టి ఇద్దరు ఆర్ఎంవోలు, ఒక డ్యూటీ డాక్టర్ నంబర్ ఇచ్చారు. దీన్ని పరిశీలించిన మంత్రి.. ‘ఈ నంబర్లు పనిచేస్తున్నాయా?’ అంటూ ఆర్ఎంవో నంబర్‌కు ఫోన్ చేశారు. ఆమె అక్కడే ఉండటం, ఫోన్ రింగ్కావడంతో అధికారులను అభినందించారు. మెటర్నిటీ వార్డుకు వెళ్తుండగా మధ్యలో కనిపించిన అటెండెంట్స్ను పలుకరించారు. ఈ సందర్భంగా సంభాషణ ఆసక్తికరంగా సాగింది.
అటెండెంట్స్‌తో సంభాషణ
మంత్రి :- ‘మీవోళ్లకు నార్మల్ డెలివరీ చేసిన్రా. సిజేరియనా?’
అటెండెంట్స్ :- ‘సిజేరియన్ సారు’
మంత్రి :- ‘ఎందుకట్ల?’
అటెండెంట్స్ :- ‘నేనే చెయ్యిమని చెప్పిన’
మంత్రి :- ‘అది మంచి పద్ధతి కాదమ్మా.. నార్మల్ డెలివరీ అయితేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటరు. ఆపరేషన్ అయితే భవిష్యత్తులో తల్లికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇకనుంచైనా మీకు తెలిసినవాళ్లందరికీ నార్మల్ డెలివరీలు చేయించండి’ అని మంత్రి హరీశ్‌రావు సూచించారు.
‘ఎక్కడి నుంచి వచ్చారు? డాక్టర్లు సరిగా చూసుకుంటున్నారా? చికిత్స మంచిగా అందుతున్నదా?’ కావాల్సిన మందులన్నీ దవాఖానలోనే ఇస్తున్నారా? బయటికి రాస్తున్నారా? అంటూ మంత్రి రోగులను అడిగారు.
దవాఖానలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకేమైనా సదుపాయాలు కావాలా? మంత్రి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.తెలిపిన సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు.
రోగులతో సంభాషణ ఇలా..
మంత్రి: మీది ఏఊరు.. ఎలా ఉన్నారు ?
రోగి: సార్ నాపేరు నాగ మునీందర్. మాది పశ్చిమగోదావరి జిల్లా. మోకీలు మార్పిడి ఆపరేషన్ ఉచితంగా చేశారు. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారు. మందులు ఇస్తున్నారు.
మంత్రి: ఇక్కడ సౌలత్లు మంచిగున్నయా? రూ.5 భోజనం పెడుతున్నరా?
రోగి సహాయకుడు: మంచిగున్నయి సారు. మూడుపూటల పెడుతున్నరు.
మంత్రి: మీకెన్ని ఎకరాల భూమి ఉందమ్మా?
రోగి సంబంధీకురాలు: మూడెకరాలు సార్
మంత్రి: అంటే నీకు రూ.3 కోట్ల ఆస్తి ఉన్నట్టే. సీఎం కేసీఆర్ వచ్చినంక భూముల రేట్లు పెరిగినయి కదా. ఇప్పుడు ఎకరం కనీసం రూ.కోటి పలుకుతున్నది కదా.