బెంగళూరు : భారత్ ‘ఏ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టు పోరులో దక్షిణాఫ్రికా ‘ఏ’ అద్భుత విజయం సొంతం చేసుకుంది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ కాస్తా 1-1తో సమమైంది. యువ భారత్ నిర్దేశించిన 417 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదన కోసం ఓవర్‌నైట్ స్కోరు 25/0తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన సఫారీలు..భారత బౌలర్లకు చుక్కలు చూపెట్టారు. పసలేని భారత్ ‘ఏ’ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ ఐదుగురు బ్యాటర్లు అర్ధసెంచరీలతో కదంతొక్కారు. ఓపెనర్లు హెర్మన్(91), సెనోవేన్(77) అర్ధసెంచరీలతో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.
దక్షిణాఫ్రికాతో త్వరలో జరుగబోయే టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా జరిగిన ఈ పోరులో మన బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆకాశ్‌దీప్(1/106), హర్ష్ దూబే(1/111) ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. హెర్మన్ నిష్క్రమణతో తొలి వికెట్‌కు 156 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జుబెర్ హమ్జా(77), తెంబా బవుమా(59), కానర్ ఏస్తర్జెన్(52 నాటౌట్) అర్ధసెంచరీలతో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించారు. ప్రసిద్ధ్ కృష్ణ(2/49) రెండు వికెట్లు తీయగా, సిరాజ్(1/53) సత్తాచాటలేకపోయాడు. అకెర్‌మన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, జురెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.