సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) ; జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతో అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతున్నది. అభ్యర్థి, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఎలాగైనా గెలువలేమని గుర్తించిన కాంగ్రెస్.. ఇప్పటికే ప్రతిపక్ష నేతలకు బెదిరింపులు, దాడులకు తెగబడడమే గాక ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు సంచుల్నీ గుమ్మరించింది. ఇక ఆదివారం సాయంత్రంతో ప్రచారం కూడా పూర్తయి పోలింగ్‌కు గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో చివరి అస్త్రంగా దొంగ ఓట్లను నమ్ముకున్నట్టు సమాచారం. సంగారెడ్డి, బీదర్ ప్రాంతాల నుంచి రౌడీబ్యాచ్ను, ప్రైవేట్ సైన్యాన్ని రంగంలోకి దింపి దొంగ ఓట్లు వేయించాలని స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది. అయితే వీటికి అధికార యంత్రాంగం అడ్డుకట్ట వేస్తుందో లేదో చూడాలి మరి.
ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. పోలింగ్ మాత్రమే మిగిలి ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలువాలని కుట్రలు పన్నుతున్నది. ఇప్పటికే తమ అభ్యర్థి నవీన్‌యాదవ్ కుటుంబానికి రౌడీముద్ర ఉండడం, పలువురు రౌడీషీటర్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలకు తోడు పార్టీలో కుమ్ములాటలు, ప్రభుత్వంపై వ్యతిరేకత.. ఇలా అన్ని అంశాలు హస్తానికి ప్రతికూలంగా ఉన్నాయి. దీంతో ఓటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను నియోజకవర్గంలో డంప్ చేసి క్షేత్రస్థాయిలో పంపకాలు చేశారు. పార్టీపై అయిష్టంగా ఉన్న అన్ని వర్గాల ఓట్లను డబ్బుతో కొనేందుకు విఫలయత్నం చేస్తున్నా, ప్రజల మూడ్ మారడం లేదనే చివరి ప్రయత్నంగా దొంగ ఓట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.
స్వలాభం కోసమే దొంగ ఓట్లపై నిర్లక్ష్యం
జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లు ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. కోర్టుకు సైతం వెళ్లింది. అయినా వాటిని తొలగించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా స్వలాభం కోసమే పూర్తిస్థాయిలో దొంగ ఓట్లను తీసేయలేదనే ఆరోపణలున్నాయి. ఆ దొంగ ఓట్లనే ఇప్పుడు ఓటర్లుగా మలిచేందుకు రౌడీషీటర్లను రంగంలోకి దింపి ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించాలనే కుట్రలు చేస్తున్నది. ఆదివారం సాయంత్రం తర్వాత నియోజకవర్గంలో బయట వ్యక్తులు ఉండేందుకు వీల్లేదు. ప్రచారంలో పాల్గొన్న ఆయా పార్టీల నాయకులు ప్రచార సమయం ముగియగానే ఆయా హోటల్స్, లాడ్జీలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడే కాంగ్రెస్ అభ్యర్థి ప్రైవేట్ సైన్యం, దొంగ ఓట్ల బ్యాచ్ రంగంలోకి దిగుతున్నది.
దొంగ ఓట్లు వేసేందుకు వచ్చేవారు నియోజకవర్గంలో కాకుండా బయటే ఉండేలా చూసుకుంటున్నట్టు సమాచారం. పరిస్థితులను బట్టి ఆయా దొంగ ఓటర్లను వాహనాలు సమకూర్చి, కావాల్సిన బూత్‌లలో తిప్పేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. ఎవరు ఏ బూత్‌లో ఏ సమయంలో ఓటింగ్‌లో పాల్గొనాలి?, ఒక్కొక్కరు ఎన్ని ఓట్లు వేయాలి?, ఓట్లు వేయించే వారు ఎవరు? ఇలా అన్ని రకాలుగా రూట్‌మ్యాప్ సిద్ధం చేసినట్టు సమాచారం. ఇందుకోసం స్థానిక, ఇతర ప్రాంతాల రౌడీలను బృందంగా ఏర్పాటు చేసి ఆయా బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.
అడ్డుకునేదెవరు?
కాంగ్రెస్ పార్టీ వేసిన దొంగ ఓట్ల స్కెచ్ సంగతి అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉన్నదంటూ స్థానికంగా చర్చ జరుగుతున్నది. కొందరు పోలీసులు కాంగ్రెస్‌కు కార్యకర్తల్లా పనిచేస్తున్నట్టు ఇటీవలి కొన్ని సంఘటనలతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఉప ఎన్నిక కోసం తమకు కావాల్సిన అధికారులను ఈ ప్రాంతానికి ప్రభుత్వం బదిలీ చేయించుకున్నది. వివిధ సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న నేపథ్యంలో దొంగ ఓట్లనే నమ్ముకోవాలని నిర్ణయించుకొని ఇందుకోసం పోలీసులు కూడా తమ వంతు సహకారం అందించేలా పైనుంచి కీలక ఆదేశాలు అందినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ దొంగ ఓట్లను అడ్డుకునేది ఎవరు?, వారిని ప్రశ్నించేది ఎవరు, ఒకవేళ ప్రశ్నిస్తే పోలీసులే జోక్యం చేసుకునేలా అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. ఇలా ఉప ఎన్నికలో అధికార యంత్రాంగం వన్‌సైడ్‌గా సపోర్టు చేసేలా ఒప్పందం చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజం కాదంటే ఎన్నిక పారదర్శకంగా నిర్వహిస్తూ దొంగ ఓటర్లకు తగిన బుద్ధి చెప్పాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.