సికింద్రాబాద్, మే 20 : కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే కోటా కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ‘మన ఊరు- మన బడి’, ‘మన బస్తీ- మన బడి’ పేరిట మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునీకరణ పనులు ప్రారంభం కావడంతో పాటు నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది వార్డులు, డివిజన్ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్, భూగర్భ డ్రైనేజీలు, పవర్ బోర్వెల్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి.
ఇటీవల కాలంలోనే మోండా డివిజన్ ప్రాంతంలోని పలు బస్తీల్లో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లకు మంజూరైన సుమారు రూ.1.43కోట్ల నిధులను విడుదల చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్‌ను ఎమ్మెల్యే సాయన్న కోరిన విషయం తెలిసిందే. దీంతో త్వరలోనే నిధుల మంజూరుకు లైన్ క్లియర్ కావడంతో రెజిమెంటల్ బజార్, అంబేద్కర్‌నగర్, మారేడ్‌పల్లిలోని పలు ప్రాంతాల్లో పనులు పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలోనే శనివారం కంటోన్మెంట్ పరిధిలోని రెండవ వార్డు చంద్రానగర్‌లో సుమారు రూ.15లక్షల వ్యయంతో నూతనంగా తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సాయన్న శంకుస్థాపన చేయనున్నారు. త్వరలోనే రెండో వార్డులోని పలు బస్తీల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు సైతం చేపట్టే విధంగా అడుగులు వేస్తున్నారు. కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని సుమారు 56 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద మంజూరైన చెక్కులను అబ్ధిదారులకు అందజేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సర్కారు నుంచి అందే ఫలాలను త్వరితగతిన ఇచ్చేందుకు ఎమ్మెల్యే సాయన్న కృషి చేస్తున్నారు.