ఎల్బీనగర్, మే 19 : భావితరాలకు మేలు జరిగేలా అభివృద్ధి పనులు చేపట్టాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ, జలమండలి, ఎస్ఎన్డీపీ, హార్టికల్చర్, ఇరిగేషన్ విభాగం ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని నూతన డ్రైన్స్, రోడ్లు, మంచినీటి సరఫరా పథకాలను చేపట్టాలని ఆదేశించారు. రాబోయేది వర్షాకాలం అయినందున అధికారులు ఎస్ఎన్డీపీ పనులను వేగవంతం చేయాలన్నారు. గత వరదల్లో కొన్ని, కొన్ని ప్రాంతాల్లో డ్రైన్లు, వాటర్ లైన్లు దెబ్బతిన్నాయని, వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన బాగు చేసే పనులు చేపట్టాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడెక్కడ నాలాల ఔట్లెట్లు ఉన్నాయో గుర్తించాలన్నారు.
అన్ని చెరువుల వద్ద సుదరీకరణ పనులు చేపట్టి చుట్టూ లైటింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. బాక్స్ డ్రైన్, ఓపెన్ నాలా పనులతో ప్రజలకు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు సలహాలు, సూచనలు చేయాలన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఓ రోల్ మోడల్‌గా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, ఉప కమిషనర్ సురేందర్‌రెడ్డి, ఎస్ అశోక్‌రెడ్డి, ఈఈ రమేశ్‌బాబు, కోటేశ్వర్రావు, ఇరిగేషన్ విభాగం డీఈ పవన్, ఎస్ఎన్డీపీ ఈఈ కృష్ణయ్య, ఎల్బీనగర్ జలమండలి జీఎం వినోద్ పాల్గొన్నారు.