అత్తాపూర్, మే 19 : ప్రజలకు ఉపయోగపడే పార్కు ల్లో పలువురు వాహనాలను పార్కింగ్ చేస్తుండడంతో ఎవరికీ ఉపయోగపడటం లేదు. పార్కుల్లో పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు అందు బాటులోని తేవాల్సిన అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టక పోవడంతో అవి అన్యాక్రాంతమవుతున్నాయి. ముఖ్యంగా హుడాకాలనీలో ఉన్న పార్కులో కొందరు తమ కార్లు, వ్యాన్లను పార్కింగ్ చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
రక్షణ గోడ కూలిపోవడంతో సమస్య ఉత్పన్నం..
పార్కు చుట్టూ ఉన్న రక్షణ గోడ కూలిపోవడంతో సమస్య ఉత్పన్నం అయ్యింది. రాత్రి వేళలో మరికొందరు గూడ్స్వాహనాలను పార్కింగ్ చేసుకొని ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్కుస్థలం అన్యాక్రాంతం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ప్రజల అవసరం కోసం కేటాయించిన పార్కులో మొక్కలను పెంచాల్సి ఉండగా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కాలనీ వాసులు తెలిపారు. మూడు రోడ్లు ఉన్న హుడకాలనీ పార్కును అభివృద్ధి చేస్తే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు తెలిపారు. గతంలో ఎన్నో సార్లు ఉద్యానవనశాఖ అధికారులకు మొక్కలను పెంచాలని చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్య క్తం చేశారు. రానున్నది వర్షకా లం కావడంతో హరితహరం కార్యక్రమం ద్వారా పార్కులో మొక్కలు నాటాలని స్థానికులు కోరుతున్నారు. పా ర్కులో ఆటవస్తువులు ఏర్పాటు చేస్తే చిన్నారులకు ఉపయోగకరంగా ఉంటుందని కాలనీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అన్ని పార్కులఅభివృద్ధికి చర్యలు తీసుకుంటాం
పార్కుస్థలాన్ని కాలనీ వాసులకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తాం. పార్కునకు రక్షణ గోడ లేకపోవడంతో సమస్య తలెత్తుతున్నది. కొద్ది రోజుల్లోనే హుడాకాలనీతో పాటు అత్తాపూర్ డివిజన్లోని అన్ని పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.
– రఘువీర్, అత్తాపూర్ ఏఈ