బంజారాహిల్స్,మే 18: ప్రియురాలిని ఇబ్బంది పెడుతున్నాడని పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేశారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని జ్ఞానీజైల్‌సింగ్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఓ బాలుడు స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతూ తోటి విద్యార్థినికి నువ్వంటే నాకిష్టం అని చెప్పాడు. ఆ బాలిక లంగర్‌హౌజ్ సమీపంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి కాంబ్లే రోహన్(19)ను ప్రేమిస్తోంది. తనను స్కూల్లో ఓ బాలుడు ఇబ్బంది పెడుతున్నాడని ఫోన్ చేసి చెప్పడంతో ఆగ్రహానికి గురైన రోహన్, తన స్నేహితులు దొడ్డి సంజయ్, అభిషేక్, నరేశ్‌తో కలిసి మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో రెండు బైక్‌లపై ఫిలింనగర్‌కు వచ్చారు.
మాట్లాడే పని ఉందని ఆ బాలుడిని ఫిలింనగర్‌లోని శంకర్ విలాస్ చౌరస్తా వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకున్న రోహన్, సంజయ్‌లు లంగర్‌హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వెనకాల ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లారు. అనంతరం ‘నా లవర్ జోలికి వస్తే అంతుచూస్తానంటూ.. ’ బాలుడిపై రోహన్ విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా మరోసారి తన లవర్ వద్దకు వెళ్లనని చెప్పు అంటూ బెదిరించి వీడియోలు, సెల్ఫీలు తీసుకుని ఫిలింనగర్‌లోని తన ప్రియురాలికి పంపించాడు.
అనంతరం ఆ బాలుడిని బైక్‌పై తీసుకొచ్చి బాపూఘాట్ రోడ్డు మీద వదిలేసి పారిపోయారు. స్థానికుల సమాచారంతో వచ్చిన లంగర్‌హౌజ్ పోలీసులు బాధితుడిని ఉస్మానియా దవాఖానలో చేర్చారు. సంఘటన జరిగిన ప్రాంతం రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోకి వస్తుందని, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులకు పంపించారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులు రోహన్, సంజయ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.