బంజారాహిల్స్,మే 18: టీఆర్ఎస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం పొందిన టీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర నివాసం వద్ద సందడి నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో రవిచంద్ర నివాసానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు మున్నూరు కాపు సంఘం నేతలు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ బొంతు రాంమోహన్, మున్నూరు కాపు సంఘం నాయకులు కొండా దేవయ్య, సర్దార్ పుటం పురుషోత్తమ్ రావు తదితరులు వద్దిరాజు రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. మున్నూరు కాపులకు రాజకీయ అవకాశాలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి తాను చేసిన కృషికి గుర్తింపుగా ముఖ్యమంత్రి అవకాశం కల్పించారని, ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.