పీర్జాదిగూడ, మే 17 : ఫ్లాట్ కొనుగోలు వివాదంలో ఓనర్‌ను హత్య చేసిన నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని షేక్‌పేట, నానక్‌రామ్‌గూడకు చెందిన రమేశ్‌రెడ్డికి పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేడిపల్లి ప్రశాంత్నగర్కాలనీలోని ఐడియా జనార్దన్ రెసిడెన్సీలో ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందులో ఒక ఫ్లాట్‌ను మహబూబాబాద్ జిల్లా అమనగల్‌కు చెందిన రాపోలు వెంకటేశ్ అలియాస్ వెంకన్న (35) నవంబర్ 2021లో రూ. 50 వేలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అనంతరం రూ. 5 లక్షలు చెల్లించాడు. అయితే ఫ్లాట్‌కు బ్యాంక్ లోన్ రాకపోవడంతో పూర్తి డబ్బులు చెల్లించడానికి జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఫ్లాట్ రిజస్ట్రేషన్ గురించి ఇద్దరికీ గొడవలు జరిగాయి.
వెంకటేశ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదని అదే ఫ్లాట్‌ను ఓ ఏజెంట్ ద్వారా ఇతరులకు విక్రయించేందుకు ఈ నెల 13న వస్తున్నాడని తెలుసుకుని వెంకటేశ్ ఆ రెసిడెన్సీ వద్దకు వచ్చాడు. అదే సమయంలో అక్కడికి రమేశ్‌రెడ్డి రావడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ముందస్తు ప్లాన్‌తో ఉన్న వెంకటేశ్, రమేశ్‌రెడ్డి ముఖంపై పెప్పర్ స్ప్రేను కొట్టి, రాళ్లతో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే వెంకటేశ్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రమేశ్‌రెడ్డిని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించగా, చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి బైక్, సెల్‌ఫోన్‌తో పాటు అగ్రిమెంట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.