పరిగి, మే 17: పర్యాటక ప్రేమికుల కోసం హైదరాబాద్ నుంచి అనంతగిరికి ప్రత్యేకంగా టీఎస్ ఆర్టీసీ ‘అనంతగిరి గుట్ట దర్శిని’ పేరుతో బస్సు సర్వీస్‌ను నడపనున్నది. ప్రతి శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ నుంచి ఉదయం ఏడు గంటలకు బయలు దేరే ఈ బస్సు అనంతగిరిలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దర్శనం అనంతరం మధ్యాహ్నం బుగ్గ రామలింగేశ్వరాలయం, కోట్‌పల్లి ప్రాజెక్టు సందర్శన అనంతరం తిరిగి సాయంత్రం ఆరు గంటలకు చేరుకోనున్నది. ఇందుకు పెద్దలకు రూ.300లు, పిల్లలకు రూ.150 చార్జ్ చేయనున్నారు. ఈ బస్సు కోసం ముందుగానే బుక్ చేసుకోవాలి. ప్రయాణికుల సంఖ్య పెరిగితే భవిష్యత్‌లో ఇతర ప్రాంతాల నుంచి అధికారులు సర్వీసులను నడపనున్నారు. ప్రయాణికులు స్నాక్స్, భోజనం చేసేందుకు క్యాటరింగ్ లేదా అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ వారితో మాట్లాడనున్నారు.
ఈ ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. అంతేకాక ఈ బస్సు సర్వీస్‌తో పాటు వికారాబాద్‌లోని పర్యాటకంపై వికారాబాద్ డిపోకు చెందిన ఉద్యోగులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ‘అనంతగిరిగుట్ట దర్శిని’ బస్సును మంగళవారం వికారాబాద్‌లో జిల్లా కలెక్టర్ నిఖిల జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సోలోమన్ రాజు, డీవీఎం జ్యోతి, వికారాబాద్ డిపో మేనేజర్ మహేశ్ పాల్గొన్నారు.