వనస్థలిపురం, మే 17 : దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ఎదుగుతున్నదని ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. హస్తినాపురం బీజేపీ సీనియర్ నాయకుడు లాలూ నాయక్ ఇటీవల టీఆర్ఎస్లో చేరిన విషయం విదితమే. కాగా ఆయన ఆధ్వర్యంలో మంగళవారం బీజేపీకి చెందిన 100మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నయం లేదన్నారు. సీఎం కేసీఆర్ పాలన, అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు, ఇతర పార్టీల నేతలు ఆకర్శితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. జాతీయ పార్టీలు దేశాన్ని పాలించడంలో పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. అనంతరం ఇంద్రసేనారెడ్డినగర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మానాయక్, టీఆర్ఎస్ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి, డేరంగుల కృష్ణ, నారగోని శ్రీనివాస్ యాదవ్, బాలం ఈశ్వర్, గోపీనాయక్, తదితరులు పాల్గొన్నారు.