సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ)/ అబిడ్స్ : నిబంధనలు ఉల్లంఘించిన మన్సురాబాద్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డికి ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం రూ.5వేలు జరిమానా విధించింది. తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్‌షాకు స్వాగతం పలుకుతూ అనధికారిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకుగాను ఈ పెనాల్టీ విధించారు. మంగళవారం పలు సంస్థలపై ఈవీడీఎం కొరఢా ఝుళిపించింది. అమీర్‌పేటలో నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్న గౌతం ఐటీ సొల్యూషన్స్ సంస్థకు రూ.5వేలు, సునాథ్ టెక్నాలజీస్‌కు రూ.5వేలు, ఎస్ఎస్ ట్రైనింగ్స్‌కు రూ.20వేలు జరిమానా విధించారు. వీటితో పాటుగా హబ్సిగూడలో ప్రమాదకరంగా భవన నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న దుర్గా భవానీ సెంట్రింగ్ వర్క్స్ వాహనానికి రూ.25వేలు పెనాల్టీ విధించారు. జాంబాగ్ పూల మార్కెట్లో రోడ్డును అక్రమించి పూల వ్యాపారం చేస్తున్న 84 షాపులకు కలిపి రూ.42వేల జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు.